కాంగ్రెస్ రిస్క్‌లో పడేస్తోంది: మోడీ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-29 15:10:33  IST  )

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పాలక్కాడ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.

కాంగ్రెస్ రిస్క్‌లో పడేస్తోంది: మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పాలక్కాడ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అటు అంతర్జాతీయ పరిణామాలు, ఇటు రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో జరుగుతున్న యుద్ధంపై మోడీ స్పందించారు. ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై పడకుండా తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దేశ ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన హామీ ఇచ్చారు. కేరళ నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ప్రధాని భరోసా ఇచ్చారు. యుద్ధం మొదలైనప్పటి నుండి తాను ఆయా దేశాల అధినేతలతో టచ్‌లో ఉన్నానని, అక్కడ చిక్కుకున్న భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయాలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ తీరుపై విమర్శలు..

ఇంతటి సున్నితమైన అంతర్జాతీయ అంశంపై కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందని మోదీ మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటి మంది భారతీయుల జీవితాలను కాంగ్రెస్ రిస్క్‌లో పడేస్తోందని ఆయన ఆరోపించారు. కేరళను పాలిస్తున్న ఎల్డీఎఫ్ (LDF), ప్రతిపక్ష యూడీఎఫ్ (UDF)లు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని, దశాబ్దాలుగా కేరళను ఇవి కలిసి లూటీ చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం పంపే నిధులను కూడా ఈ కూటములు దుర్వినియోగం చేస్తున్నాయని, ప్రజలు వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈసారి కేరళలో మార్పు తథ్యమని మోడీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోందని, కేరళ అభివృద్ధి కోసం తాము శాయశక్తులా కృషి చేస్తామని స్పష్టం చేశారు. కేరళ ప్రజల ఆశీస్సులు తమపై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి, ప్రధాని మోడీ ప్రసంగం కొత్త ఊపునిచ్చింది. ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను, రాష్ట్రంలోని అవినీతిని ప్రధానాంశాలుగా చేసుకుని మోడీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

భారతీయుల ప్రాణాలతో కాంగ్రెస్ గేమ్స్.. కేరళలో ప్రధాని మోడీ ఫైర్

Next Story