కరోనా వేళ కూడా బిజినెస్​ ట్రిక్సే

by  |
కరోనా వేళ కూడా బిజినెస్​ ట్రిక్సే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కారణంగా అన్ని రంగాలూ కుదేలై, ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. లాక్​డౌన్​తో ఉద్యోగులకు జీతాలు పెరిగింది లేదు.., కార్మికులకు పని దొరుకుతున్నది లేదు.., ఒక్కటేమిటి అన్ని రంగాల పరిస్థితి దాదాపు అంతే.. బతుకడమే గగనంగా మారిన దుస్థితి.. ఇదంతా నాణానికే ఓ వైపు అయితే నిర్మాణ రంగానికి సంబంధించి బిల్డర్లది మరో దారిగా కనిపిస్తున్నది.. మాయమాటలతో, ఆకర్షణీయమైన ప్రకటనలతో జనాలను మోసం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ముడి సరుకుల ధరలు పెరిగాయి చెప్పుకుంటూ, ఫ్లాట్ల రేట్లు పెంచి సొంతింటి కళను కలగా మార్చుతున్నారు. బడా బిల్డర్లు ముడిసరుకుల ధరల పెంపును బూచీగా చూపించి ఫ్లాట్లు, డూప్లెక్స్ ల ధరలు ఏకంగా 75 శాతానికి పైగా చెబుతున్నారు. సిమెంట్, స్టీలు ధరల పెరుగుదలను లెక్కిస్తే చ.అ.నకు కేవలం రూ.200 మాత్రమే భారం పడాల్సి ఉండగా, వాళ్లు మాత్రం ఫ్లాట్ల ధరలు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పెంచేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కృత్రిమ డిమాండ్ మాత్రమే..

కరోనా కాలంలో ప్రైవేటు రంగ ఉద్యోగులెవరూ ఇంకా కోలుకోలేదు. కానీ ఎవరైనా ఫ్లాటు కొనడానికి ప్రాజెక్టు దగ్గరికి వెళ్తే చాలు ఎగ్జిక్యూటివ్స్​ ఆకర్షణీయమైన మాటలతో కట్టిపడేస్తున్నారు. కరోనా తర్వాత అందరూ సొంతింటిని కోరుకుంటున్నారని, భవిష్యత్​లో మరింత ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ అదరగొడుతూ ఫ్లాట్​ బుక్​ చేసుకునేవిధంగా ఒత్తిడి చేస్తున్నారు. నిజానికి 2018 లో బడా సంస్థల ప్రకటనలు, ప్రచార వార్తల్లో పేర్కొన్న ధరలకు, ప్రస్తుతం ప్రకటిస్తోన్న ధరలకు మధ్య వ్యత్యాసం 75 శాతం వరకు కనిపిస్తోంది. నిజానికి ఏ ధరలు ఆ స్థాయిలో పెరిగిన దాఖలాలు లేవు.

ఎకరాల్లో కొని.. చ.అ.ల్లో అమ్మకం..

బడా సంస్థలన్నీ గజాల్లో కొనుగోలు చేసిన స్థలాలు తక్కువ, ఎకరాల్లోనే కొనుగోలు చేసినవే ఎక్కువ. ఆ తర్వాత నాలా కన్వర్షన్ చేయించుకొని కమర్షియల్ గా మార్చుకోవడం పరిపాటి. అనుమతులు తీసుకొని ప్రాజెక్టు లాంఛ్ కంటే ముందుగానే ఫ్లాట్ల అడ్వాన్స్ బుకింగ్ అంటూ అందమైన ఆఫర్లు ఇస్తారు. ఆ ఆఫర్లకు మోసపోయిన కొనుగోలుదార్లు అడ్వాన్సులు చెల్లిస్తారు. ఇక ప్రాజెక్టు పూర్తి సమయం కంటే ముందుగానే హ్యాండోవర్ చేసిన సంస్థలు, ప్రాజెక్టుల సంఖ్య వేళ్ల మీద లెక్కించాల్సిందే. సాగు భూమిగా కొనుగోలు చేసిన బిల్డర్లు.. చ.అ.ల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. రాజేంద్రనగర్ బుద్వేలులో ఐటీ పార్కును ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు అతీగతీ లేదు. కానీ ఆ పక్కనే బండ్లగూడలో చ.అ.3 వేలు ఉండే ఫ్లాట్లు రూ.40 లక్షల్లోపే వచ్చేది. ఇప్పుడక్కడ రూ.5 వేలకు పెంచేశారు. గజం ధర రూ.15 వేలు ఉండేది. ఇప్పుడక్కడ రూ.50 వేల నుంచి రూ.60 వేలకు పెంచేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఐటీ పార్కుకు శంకుస్థాపన కూడా రాలేదు. కానీ ప్రతి బిల్డర్ ఆ ప్రతిపాదనను సొమ్ము చేసుకుంటుండడం గమనార్హం. అలాగే ముచ్చర్ల ఫార్మా సిటీ, ఈస్ట్ కారిడార్ లో ఐటీ వంటి ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ బిల్డర్లకు వరాలుగా మారాయి. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రాజెక్టులను ప్రకటిస్తుండడంతో బ్రోచర్లలో అందంగా ముస్తాబు చేస్తున్నారు.

కరోనా డిస్కౌంట్ 10 శాతం..

మూడేళ్లలో ఫ్లాట్ల ధరలు 75 శాతం వరకు పెంచేశారు. ఇప్పుడీ కరోనా, లాక్ డౌన్ పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునేందుకు 10 శాతం డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్న బడా సంస్థలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. 2018లో చ.అ. ధర రూ.3500 వరకు ఉండే ప్రాంతాల్లో తాజాగా రూ.5000 వరకు చెబుతున్నారు. దానికి పది శాతం ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఆఫర్ల వెనుక ఆంతర్యేమిటో కొనుగోలుదార్లు పరిశీలించుకోవాలని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి భవన నిర్మాణ రంగంలో రాజకీయ నాయకుల భాగస్వామ్యం అధికంగా ఉండడం వల్ల ప్రభుత్వం కూడా ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతుందంటున్నారు.

ఫ్లాట్ల ధరలు డబుల్..

గ్రేటర్ హైదరాబాద్ లో ఫ్లాట్ల ధరలు ఈ మూడేళ్లలో డబుల్ చేశారు. సిమెంటు ధరలు మాత్రం కేవలం ఒక శాతమే పెరిగాయి. సిమెంటు, స్టీలు ధరలు పెరిగాయని, నిర్మాణం పెనుభారంగా మారిందని ప్రచారం చేయడం తప్పు అని ఉమ్మడి రాష్ట్రంలోని ఓ ప్రధాన సిమెంటు తయారీ సంస్థ డైరెక్టర్ ‘దిశ’కు వివరించారు. వారి స్వలాభం కోసం అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారన్నారు. సిమెంటు ధరలు ట్రేడ్ రిటెయిల్ లో రూ.350 నుంచి రూ.400, నాన్ ట్రేడ్ బిల్డర్స్ కు రూ.250 నుంచి రూ.330 వరకు ఉందన్నారు. సిమెంటు ధరలు అమ్మకపు ధరలు 2 నుంచి 5 శాతం పెరిగాయి. దీంతో చ.అ. నిర్మాణానికి రూ.250 వరకు పెరుగుతుంది. కానీ బిల్డర్లు చ.అ.కు రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. కరోనా, లాక్ డౌన్ తర్వాత బతకడం ఎట్లా అని అందరూ ఆలోచిస్తున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ అన్నారు. కొన్ని బడా సంస్థలు వినియోగదారులను దోపిడీ చేసేందుకే వారి సంస్థలతోనే సర్వే చేసినట్లుగా, నివేదికలు విడుదల చేసినట్లుగా మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.


Next Story

Most Viewed