చెరువుకట్టపై, టేకుచెట్లలో ఆ పని.. ఎవరికి అనుమానం రాకుండా ఒకరు కావలి

by  |
teku-chetulu
X

దిశ, వాజేడు: వాజేడు మండల పరిధిలో పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు రూ. లక్ష నుంచి 3 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. మండలంలో చింతూరు గ్రామ శివారులో చెరువు కట్టపై, లక్ష్మీపురం నుండి ధర్మారం వెళ్లే మార్గం వద్ద టేకు చెట్లలో, అదేవిధంగా పేరూరు జామాయిల్ తోటలలో అడ్డాలుగా చేసుకొని ఎవరికి అనుమానం రాకుండా రోజుకు ఒక అడ్డాలో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. పేకాట స్థావరాలకు కొందరు వ్యక్తులు పటిష్టమైన కాపలా మధ్య పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పేకాట స్థావరాల దగ్గరికి ఎవరు రాకుండా ఉండేవిధంగా, ఒకవేళ వచ్చినా ముందుగానే సమాచారం అందే విధంగా కొంతమంది యువకులను రోడ్లపై ఏర్పాటు చేసి నిఘా పెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆటలో కూర్చునే వ్యక్తి వద్ద కనీసం 15000 రూపాయలు ఉన్నట్లుగా ముందుగానే చూపించాల్సి ఉంది. ఆ డబ్బులు ఉంటేనే ఆటలో కూర్చొనిస్తారు. పేకాట మూడు ముక్కలు ఆరు ఆటలుగా కొనసాగుతుంది. అడ్డా వద్ద 15 మందికి పైగా పేకాట ఆడుతూ ఉంటారు. వీరిలో ఎక్కువ మంది 30 సంవత్సరాల లోపు యువకులే ఉండడం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షిఫ్ట్ ల వారీగా పేకాట కొనసాగిస్తున్నారు.

poker-2

దీంతో కొందరు రూ. లక్షలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. పేక ముక్కలు కలిపి ఇద్దరు వ్యక్తులకు వేస్తే కోరుకున్న ముక్క ఎవరికి పడితే వారే ఆట గెలిచినట్లుగా భావిస్తారు. ఇందులో చుట్టుపక్కల వ్యక్తులు కూడా పందాలు ఎక్కువగా పట్టుకుంటారు. పేకాటకు బానిసలుగా మారిన యువత జీవితం నాశనం అవుతుంది. పేకాట నిర్వహణ వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి పేకాట ఆడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాజేడు మండల ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed