ఫైజర్ టీకా.. భారత్‌కు పెనుభారం?

by  |
ఫైజర్ టీకా.. భారత్‌కు పెనుభారం?
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనాను నివారించడంలో 90శాతం మంచి ఫలితాలు కనబరిచిన ఫైజర్ టీకా భారత్‌‌కు పెనుభారంగా మారనుంది. ఈ టీకా పంపిణీ చేయాలంటే దేశం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొవాల్సి ఉండనుంది. తక్కువ జీవితం కాలం, -70 డిగ్రీల ఉష్ణోగ్రతల నిల్వ, రెండు డోసులు ఇవ్వడం లాంటివి ఫైజర్ పంపిణీలో ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఎంఆర్ఎన్ఏ ఆధారిత ఫైజర్ టీకా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కష్టతరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా వరకు టీకాలు డీఎన్ఏ ఆధారంగా అభివృద్ధి చేసినవే. మన దేశంలో ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకాల పంపిణీ జరగలేదు. అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతల దగ్గర నిల్వ చేసే వ్యవస్థ ఇక్కడ ఉనికిలో లేదు. ఇప్పుడు ఫైజర్ టీకాను మనదేశంలో పంపిణీ చేయాలంటే -70 డిగ్రీల దగ్గర నిల్వ చేసే వ్యవస్థను కొత్తగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.

మారుమూల ప్రాంతాలకు ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం కష్టసాధ్యం. ఈ ఉష్ణోగ్రతల నుంచి బయటకు తీశాక ఐదు రోజుల్లో టీకా వేయాల్సి ఉంటుంది. లేదంటే టీకా ప్రభావం చూపించకపోవచ్చు.రెండో డోసూ వేయాల్సి ఉండటంతో మారుమూల ప్రాంతాల్లో తొలిడోసు వేసిన ప్రజల కాంటాక్టులను మళ్లీ కలుసుకోవడం, వారు నిర్దేశిత సమయంలోపు రెండో డోసు వేసుకోకపోవడం వలన యంత్రాంగానికి కత్తిమీద సామేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కూడా స్పష్టంచేశారు.

ధర ఎక్కువే?

ఒకవేళ కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేసి దాని పంపిణీ చేసినా ,ఆ వ్యవస్థ నిర్వహణ కారణంగా టీకా ధర కొండెక్కే అవకాశమున్నది. ఫైజర్ టీకా ధరపై తుది నిర్ణయం ఖరారు కాలేదు. కానీ, ఎంఆర్ఎన్ఏ ఆధారంగానే అమెరికా అభివృద్ధి చేసిన మొడెర్నా టీకా ఒక్క డోసు సుమారు రూ. 2,746గా ఉండే అవకాశముంది. అంటే రెండు డోసులకు ఐదున్నర వేలుగా ఉండనుంది. ఫైజర్ టీకా ధర కూడా ఇదే దరిదాపుల్లో ఉండనున్నట్లుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed