మళ్లీ నగరానికి వాపస్

by  |
మళ్లీ నగరానికి వాపస్
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : ప్రభుత్వం లాక్​డౌన్​విధించినప్పుడు ఉపాధి లేక పట్నం నుంచి జనమంతా సొంతూళ్లకు పరుగులు పెట్టారు. నేడు పల్లెల్లోనూ కరోనా కేసులు ఎక్కువ అవుతుండడంతో నగరం బాట పడుతున్నారు. ఇన్నాళ్లు సేఫ్​ అనుకున్న ఊళ్లలో కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్నది. ఇదే క్రమంలో గ్రామాల్లో ఉపాధి లేక పోవడం, పాఠశాలల్లో ఆన్ లైన్​క్లాసులు మొదలవడంతో మళ్లీ రివర్స్ వస్తున్నారు. దీంతో హైదరాబాద్ లోని రోడ్లపై కొద్ది రోజులుగా రద్దీ పెరిగింది.

కారణాలెన్నో..

గ్రామాల్లో సుమారు రెండు వారాల క్రితం వరకు తక్కువగా నమోదైన కేసులు కొన్ని రోజులుగా గణనీయంగా పెరగడం అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హైదరాబాద్ లో ఇటీవల ప్రభుత్వం అధికారికంగా చూపుతున్న కరోనా లెక్కల్లో తక్కువ కేసులు నమోదు కావడం, పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతులు మొదలుకావడం వంటి వాటితో ప్రజలు తిరిగి నగరం బాటపడుతున్నారు. దీనికి తోడు కరోనా మొదలైన రోజుల్లో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది పేద ప్రజలు గ్రామాలకు వెళ్లి వ్యవసాయ పనులు, ఉపాధి పనులు, కూలీ పనులకు వెళ్లేవారు. రోజుల వ్యవధిలో గ్రామాల్లోనూ కరోనా కేసులు అధికంగా కావడం, ఉపాధి పనులు లేకపోవడం వంటి కారణాలు మొదలయ్యాయి. దీంతో ఉపాధిని వెతుక్కుంటూ తిరిగి పట్నాలకు తరలుతున్నారు.

పెరిగిన ట్రాఫిక్..

ప్రజలు పల్లెల నుంచి పట్నం బాటపడుతుండడంతో హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులుగా ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. మలక్ పేట్, చాదర్ ఘాట్, పుత్లీబౌలి, కోఠి, ఆబిడ్స్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, కర్మన్ ఘాట్, ఎల్బీనగర్, హయత్ నగర్, ఉప్పల్, అంబర్ పేట్, రామాంతాపూర్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో కరోనా మొదలు కాకముందు పరిస్థితులు కనబడుతున్నాయి. రోడ్లపై పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.

భౌతికదూరం పాటించడం లేదు..

మహానగరంలో ప్రజలు ప్రభుత్వం చెప్పినట్లుగా కరోనాతో సహవాసం చేస్తున్నారు. నిత్యం వందలాది కేసులు నమోదవుతున్నప్పటికీ ఏమాత్రం భయమనేది లేకుండా రోడ్లపై సంచరిస్తున్నారు. మాస్కులు అంతంత మాత్రంగా ధరిస్తున్నారు. భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున గుమి కూడుతూ కొవిడ్ నిబంధనలను లెక్క చేయడం లేదు.


Next Story

Most Viewed