పాతబస్తీలో నో లాక్ డౌన్.. రోడ్లపైనే జనం!!

by  |
patha basti
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: పాతబస్తీలో లాక్ డౌన్ నిబంధనలు అమలు కావడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాల్సి ఉంది. అయితే శుక్రవారం రంజాన్ పండుగ ఉండటంతో గురువారం పాతబస్తీ ప్రజలు వేల సంఖ్యలో రోడ్లమీదకు వచ్చారు. దీంతో చార్మినార్, మదీనా, షాలిబండ, మలక్ పేట్, చాదర్ ఘాట్ తదితర ప్రాంతాలు జనసందోహంగా మారాయి. మాస్కులు పెట్టుకోకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడమే కాకుండా గుంపులు గుంపులుగా రోడ్లమీద తిరిగారు. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రతినిత్యం వేల మంది కోవిడ్ బారిన పడుతుండగా మరో వైపు అనేక మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్ డౌన్‌ను అమలులోకి తెచ్చి కఠినంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోగా పాతబస్తీ ప్రజలు ఇవేమీ తమకు పట్టవన్నట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.

11 గంటల తర్వాత

కోవిడ్ నిబంధనల మేరకు సరిగ్గా ఉదయం 10 గంటలలోపు అందరూ తమ తమ కార్యకలాపాలు ముగించుకొని ఇండ్లకు చేరుకోవాలి. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తాం, వాహనాలు సీజ్ చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఈ రూల్స్ పాతబస్తీ ప్రజలకు వర్తించవా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోడ్లపై ఉన్న ట్రాఫిక్ పోలీసులు 10 గంటల సమయంలో ఇండ్లకు వెళ్లి పోవాలని సూచించినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఫుట్‌పాత్‌పై ఉన్న బండ్లు, ఇతర దుకాణాలను మూసి వేయించారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి కదిలిన మరుక్షణంలోనే దుకాణాలు యధావిధిగా తెరచి అమ్మకాలు కొనసాగించారు. లా అండ్ ఆర్డర్, పోలీస్ ఉన్నతాధికారులు కనబడక పోగా పెట్రోలింగ్ వాహనాలు రోడ్లపై సైరన్ మోగించుకుంటూ తిరిగినా వారిని వ్యాపారులు గానీ, ప్రజలు గాని పట్టించుకోకపోవడం గమనార్హం. 11 గంటల తర్వాత పాతబస్తీ రోడ్లపై క్రమ క్రమంగా ట్రాఫిక్ తగ్గింది. ఈ నేపథ్యంలో పాతబస్తీతో పాటు నగర వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed