జడ్పీ చైర్మన్ మిస్సింగ్ మిస్టరీ.. టీఆర్ఎస్‌ ‘పుట్ట’ ఎక్కడ..?

by  |
జడ్పీ చైర్మన్ మిస్సింగ్ మిస్టరీ.. టీఆర్ఎస్‌ ‘పుట్ట’ ఎక్కడ..?
X

దిశ, కరీంనగర్ ప్రతినిధి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు రోజులుగా ఆచూకి లేకుండా పోయిన వ్యక్తి సామాన్యుడేం కాదు. సాక్షాత్తు ఓ జిల్లా పరిషత్ చైర్మన్. అందులోనూ అధికార పార్టీకి చెందిన నేత. అయినా.. అటు కుటుంబ సభ్యులు కానీ, ఇటు సొంత పార్టీ నాయకులు కానీ పోలీసులకు కూడా ఫిర్యాదు ఇవ్వకపోవడ గమనార్హం. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ..!

ఏప్రిల్ 30వ తేది అర్ధరాత్రి మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆచూకి ఇంతవరకు లభ్యం కావడం లేదు. కనీసం ఫోన్‌లో కూడా టచ్‌లోకి రావడం లేదు. దీంతో ఆయన మిస్సింగ్.. మిస్టరీగానే మిగిలిపోయింది. తెలంగాణమంతా ఈటల రాజేందర్ ఎపిసోడ్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో జడ్పీ చైర్మన్ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కానీ అధికార పార్టీ కానీ నేటికి స్పందించడం లేదు. ఇటువంటి పరిణామాలతో ఆయన ఎక్కడున్నారన్న ఆందోళన తీవ్రమవుతోంది.

ఆరా తీసిందెవరూ.?

ఏప్రిల్ 30న ఇంటెలిజెన్స్ స్పెషల్ టీంలుగా చెప్పుకుంటున్న కొంతమంది ఉమ్మడి కరీంగనర్ జిల్లా వ్యాప్తంగా తిరిగారు. పుట్ట మధు గురించి వాకబు చేశారు. అర్ధరాత్రి సమయంలో పుట్ట మధు కరీంనగర్‌కు ఎంటర్ అయిన తరువాత గన్‌మెన్లను రేపు ఉదయం రావాలని చెప్పి వెల్లగొట్టారని, మరునాటి ఉదయం ఆయన చెప్పిన అడ్రస్‌లో లేకపోవడంతో ఆందోళన చెందిన అంగరక్షకులు మొబైల్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చిందని.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రితోనే ఉన్న పెద్దపల్లి జిల్లాకు చెందిన మరో టీఆర్ఎస్ నేతను పక్కకు తీసుకెళ్లి మరీ మాట్లాడారు. ఆయన నుండి పలు విషయాలు రాబట్టిన అనంతరం సదరు నాయకుడిపై కూడా నిఘా వేశాయి.

రామగుండం కమిషనరేట్ పోలీసుల కనుసన్నల్లోనే పుట్ట ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆయన మొబైల్ సిగ్నల్ మహారాష్ట్రలో ట్రేస్ అయిందని, తెలంగాణ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరో వైపున ఛత్తీస్‌గఢ్‎లో ఉంటున్ ఆయన కూతురు వద్దకు వెళ్లారని, కర్నాటకలోని రాయచూర్ ప్రాంతంలో ఉంటున్న స్నేహితుని వద్ద ఉన్నారని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన మొబైల్ మాత్రం ఆన్ కాలేదు.

అధిష్టానం టచ్‌లోనే..

మరోవైపు మంథని ప్రాంతానికి చెందిన ‘పుట్ట మధు యువసేన’ నాయకులు సోషల్ మీడియాలో వార్నింగ్‌లు ఇస్తున్నారు. మా నాయకుడు అధిష్టానంతో టచ్‌లోనే ఉన్నారు, తప్పుడు వార్తలు రాసినా, ఫేక్ వీడియోలు క్రియేట్ చేసినా క్రిమినల్ చర్యలు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో నిజంగానే పుట్ట మధు అదిష్టానానికి టచ్‎లో ఉన్నారని భావించారంతా. కానీ, మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‎లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈటలకు వ్యతిరేకంగా వీరంతా మీడియా ముందుకు వచ్చి, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడ అధిష్టానానికి లేఖలు ఇచ్చారు. అక్కడ కూడా పుట్ట మధు కనిపించకపోవడంతో ఆయన అధిష్టానానికి అందుబాటులో ఉన్నట్టా లేనట్టా అన్న చర్చ సాగుతోంది.

ఫిర్యాదు చేయకపోవడం..?

పుట్ట మధు మిస్సింగ్ మిస్టరీపై ఇంతవరకు ఎవరూ కూడా ఫిర్యాదు చేయనట్టు తెలుస్తోంది. పోలీసులు కూడా పుట్ట మధు గురించి తమకేమీ తెలియదన్నట్టుగా ఉంటున్నారు. పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. ప్రజా క్షేత్రంలో సహాయ మంత్రి కేడర్‌లో ఉన్న జడ్పీ చైర్మన్ మిస్సింగ్ వ్యవహారంపై అటు ఫ్యామిలీ మెంబర్స్ ఇటు పార్టీ లీడర్స్ కామెంట్ కూడ చేయకపోవడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ పుట్ట ఎక్కడ ఉన్నారనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.


Next Story

Most Viewed