తగ్గిన కార్డెన్ సెర్చ్‌లు..నిందితులపై నిఘా నిల్!

115

దిశ, క్రైమ్ బ్యూరో : శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టే కార్డెన్ సెర్చ్‌ను పోలీసులు నిర్వహించడం లేదు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగే అల్లరి మూకలు, రౌడీ షీటర్లు, దుండగులు తదితర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్తులపై నిఘా కరువవుతోంది. కొన్నాళ్లుగా కార్డెన్ సెర్చ్ నిర్వహించకపోవడంతో మళ్లీ శాంతి భద్రతకుల విఘాతం కలిగేలా అల్లరి మూకలు తమ ఆగడాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం.

పెరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు పోలీసులు కార్డెన్ సెర్చ్‌లను ఐదేండ్ల క్రితం ప్రారంభించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధుల్లో ముందుస్తుగా ఎంచుకున్న ప్రాంతాన్ని పోలీసులు దిగ్భంధించి అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించేవారు. ముఖ్యంగా పహాడీ షరీఫ్ ప్రాంతంలో పలువురు దుండగులు స్నేక్ గ్యాంగ్ పేరుతో యువతులపై లైంగికదాడికి పాల్పడిన ఘటన తర్వాత.. పోలీసులు ఈ కార్డెన్ సెర్చ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రౌడీలు, క్రిమినల్ రికార్డు కలిగిన వ్యక్తులు, అసాంఘీక కార్యాకలాపాలకు పాల్పడేవారు, గుర్తు తెలియని వ్యక్తులు, సరైన పత్రాలు లేని వాహనాలు ఇలా పలు అనుమానస్పద అంశాలను పోలీసులు గుర్తించే వారు. ఆ సమయంలో పోలీసులు అనుమానస్పదంగా పట్టుబడ్డ వారిపై చర్యలు తీసుకునేవారు. కానీ, ప్రస్తుతం నగరంలో ఏడాదికి పైగా పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించడం లేదు.

2020‌లో రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నా.. నాలుగైదు నెలల పాటు కరోనా ప్రభావంతో ప్రజలు ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో చాలా వరకూ సాధారణ నేరాలు తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ తిరిగి ప్రారంభం కావడంతో సాధారణ రోజులనే తలపిస్తున్నాయి. నిఘా అంతంత మాత్రమే కావడంతో మళ్లీ ఆయా బస్తీలు, ప్రాంతాల్లో పాత నేరస్తులు తమ ఆగడాలను కొనసాగిస్తున్నారు.

ముందస్తు చర్యలు శూన్యం..

సాధారణంగా పలు నేరాలను రెండు లేదా మూడు సార్లు చేసినా, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ నమోదు చేసి సుమారు ఏడాది పాటు జైలులో నిర్భంధిస్తారు. రాయదుర్గం పీఎస్ పరిధిలో చేసిన దోపిడీ కేసులో నేపాలీ గ్యాంగ్ అందరిపై పీడీ నమోదు చేశారు. గతేడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 109 మందిపై పీడీ యాక్ట్‌ను పోలీసులు ప్రయోగించారు.

మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల వ్యాప్తంగా నగరంలో ప్రతిరోజూ సగటును 2 ప్రివెన్షన్ డిటెన్షన్‌ను పోలీసులు ప్రయోగిస్తున్నారు. దాదాపుగా వీరంతా పాత నేరస్తులే. వీరిపై సరైన నిఘా, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే పీడీ ప్రయోగం చేయాల్సి వస్తోందని స్పష్టమవుతోంది. పోలీసు శాఖ కార్డెన్ సెర్చ్ తిరిగి చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..