నెటిజన్లు షాక్…జగన్‌ను పొగిడిన పవన్ కల్యాణ్

by  |
నెటిజన్లు షాక్…జగన్‌ను పొగిడిన పవన్ కల్యాణ్
X

వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలించింది. జగన్‌ను పవన్ కల్యాణ్ అభినందించడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. దాని వెనుక కథాకమామీషు ఏంటంటే…

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వస్తున్నానని, పార్టీ పెడుతున్నానని పవన్ కల్యాణ్ ప్రకటన చేసిన నాటి నుంచి ఆయన విమర్శించే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజకీయ విమర్శలైనా, వ్యక్తిగత విమర్శలైనా సరే పవన్ కల్యాణ్ ప్రధాన లక్ష్యం జగనే. ఆఖరుకి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్‌పైనే పవన్ కల్యాణ్ విమర్శలు చేసి ఆసక్తి రేపారు. బాబు సీఎంగా ఉండగా జగన్‌పై విమర్శలు చేయడంలో పవర్ స్టార్ దూకుడుగా వ్యవహరించేవారు. ఆఖరుకి రాజధాని రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేసినా.. జగన్ ఏం చేస్తున్నారంటూ విమర్శించారే కానీ.. అధికారపక్షాన్ని మాత్రం ఏమీ అనలేదు. అలాంటి పవన్ కల్యాణ్ తొలిసారి జగన్‌ను అభినందించారు.

మూడు రాజధానులు ప్రకటించడంతో అమరావతి రైతులు ఆందోళనకు తెరతీయడంతో మరొక్కసారి పవన్ కల్యాన్ క్రియాశీలకంగా కర్నూలు, అమరావతిలో యాత్ర నిర్వహించారు. కర్నూలు పర్యటన సందర్భంగా సుగాలి ప్రీతి కేసులో ఎందుకు న్యాయం జరగలేదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కేసులో నిందితులతో టీడీపీకి సన్నిహిత సంబంధాలున్నాయని, ఈ ఘటన కూడా మూడేళ్ల క్రితం జరిగిందన్న విమర్శలు రావడంతో ఈ కేసును పరిష్కరించేందుకు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం జగన్ పర్యటన సందర్భంగా సుగాలి ప్రీతి కుటుంబం జగన్‌ను కలవడంతో కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా అందుకు చర్యలు కూడా చేపట్టారు.

ఈ నేపథ్యంలో జనసేనాని ఒక ప్రకటన విడుదల చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ముందుకు కదిలిన సీఎం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ నేత చెడు చేస్తే విమర్శలు చేయడంతో పాటు మంచి చేస్తే అభినందిస్తాడని జనసేన కార్యకర్తలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. విమర్శకులు మాత్రం బీజేపీతో పొత్తు నేపథ్యంలోనే జగన్‌పై పవన్ వ్యాఖ్యలంటూ పెదవి విరుస్తున్నారు. కాగా, మూడేళ్ల కిందట పాఠశాలకు వెళ్లిన ప్రీతి అత్యాచారం, హత్యకు గురైంది. అప్పటి నుంచి న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు తీవ్ర పోరాటం చేస్తున్నారు.



Next Story

Most Viewed