ఫ్యామిలీలో అందరూ అథ్లెట్లే.. రికార్డు మీద రికార్డులు

by Shyam |

<p>దిశ, స్పోర్ట్స్: ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు క్రీడాకారులు ఉండటం మనం తరచుగా చూస్తూనే ఉంటాము. అన్నదమ్ముడు, అక్కచెల్లెల్లు, తండ్రికొడుకులు, తల్లి కూతుర్లు ఆటలు ఆడటం మనం చూశాము. వారిలో ఎవరో ఒకరు రాణించడం చూశాము. కానీ ఈ కుటుంబాన్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇంట్లో ఉన్న ముగ్గురూ అథ్లెట్లే. అంతే కాదు అందరూ రికార్డులు సృష్టించిన వాళ్లే కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. గత వారం గౌహతీలో జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. [&hellip;]</p>

ఫ్యామిలీలో అందరూ అథ్లెట్లే.. రికార్డు మీద రికార్డులు
X

దిశ, స్పోర్ట్స్: ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు క్రీడాకారులు ఉండటం మనం తరచుగా చూస్తూనే ఉంటాము. అన్నదమ్ముడు, అక్కచెల్లెల్లు, తండ్రికొడుకులు, తల్లి కూతుర్లు ఆటలు ఆడటం మనం చూశాము. వారిలో ఎవరో ఒకరు రాణించడం చూశాము. కానీ ఈ కుటుంబాన్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇంట్లో ఉన్న ముగ్గురూ అథ్లెట్లే. అంతే కాదు అందరూ రికార్డులు సృష్టించిన వాళ్లే కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. గత వారం గౌహతీలో జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. అందులో పవన అనే 15 ఏళ్ల అథ్లెట్ హై జంప్‌లో 1.73 మీటర్ల ఎత్తు దూకింది. అండర్-16 విభాగంలో ఇది నేషనల్ రికార్డు కావడం గమనార్హం. అసలు ఈ పవన ఎవరు అని ఆరా తీయగా ఎన్నో విషయాలు తెలిసాయి. వారి ఇంటిలో పవనతో పాటు తల్లి సహన కుమారి కూడా హై జంపర్, ఇక తండ్రి నాగరాజ్ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన స్ప్రింటర్.

తల్లిదండ్రులు కూడా రికార్డు హోల్డర్లే

పవన చిన్నతనం నుంచే తల్లిదండ్రులతో కలసి మైదానానికి వెళ్లేది. ఇంట్లో పవనను ఒక్క దాన్నే వదిలేసి వెళ్లడం ఇష్టం లేక తల్లిదండ్రులు తాము కోచింగ్ తీసుకునే ప్రదేశానికి తీసుకెళ్లేవారు. పవన తల్లి సహన కుమారి 2012లో 1.92 మీటర్ల ఎత్తు దూకి జాతీయ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు సహన రికార్డును ఇండియాలో ఎవరూ బద్దలు కొట్టలేదు. ఇక తండ్రి బీజీ నాగరాజ్ ఒక స్ప్రింటర్. 2010లో అత్యంత వేగంగా పరుగెత్తగలిగే భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించాడు. ఏషియన్ గేమ్స్ ట్రయల్స్‌లో 100 మీటర్ల దూరాన్ని 10.50 సెకెన్లలో పరుగెత్తి రికార్డు సృష్టించాడు. పెళ్లి అయి పవన పుట్టిన తర్వాతే వీరిద్దరూ జాతీయ రికార్డులు సృష్టించడం గమనార్హం. ఇక ఇప్పుడు వీరిద్దరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పవన నేషనల్ జూనియర్స్‌ అండర్-16 విభాగంలో హై జంప్ రికార్డు సృష్టించింది.

ఆటంటే నాకు ప్రాణం

నాగరాజ్, సహజ ఇద్దరూ బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెంటర్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ కోచ్‌లుగా ఉన్నారు. పవన చిన్నతనంలో వీరిద్దరూ ప్రాక్టీస్ చేసే సమయంలోనే కాకుండా, తాము పని చేస్తున్న సమయంలో కూడా అక్కడకు పవనను తీసుకెళ్లేవారు. వాళ్లను చూస్తూ పవన రన్నింగ్‌పై మక్కువ పెంచుకుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ పవనను అథ్లెట్ అవమని బలవంతం చేయలేదు. అయితే స్కూల్ గేమ్స్ సమయంలో పవన ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో కొన్ని పతకాలు గెల్చుకుంది. అదే సమయంలో పవన తండ్రి లాగ 100 మీటర్ల పరుగును ప్రయత్నించింది. కానీ సరిగా రాణించలేక పోయింది. దీంతో వాళ్ల స్కూల్ కోచ్ పవన ఎత్తును దృష్టిలో పెట్టుకొని హై జంప్ ట్రై చేయమని చెప్పారు. వెంటనే పవన పరుగులు వదిలి జంపింగ్ వైపు వెళ్లింది. అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా పతకాలు గెలుస్తూ తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తున్నది. రాబోయే రోజుల్లో ఒలంపిక్స్‌లో పాల్గొని తాను కూడా తల్లిదండ్రుల్లాగ రికార్డులు సృష్టించాలని పవన కోరుకుంటుంది. తనకు ఆటంటే ప్రాణమని.. దాన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి ఆడుతున్నానని పవన అంటున్నది.

Next Story