ప్రజల కన్నీళ్లపై ఎదుగుదల మంచిది కాదు: పవన్

28

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల కన్నీళ్ల మీద ఎదుగుదల మంచిది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు చేస్తున్న ఆందోళనకు పవన్‌ మద్దతు తెలిపారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ గతంలో దివిస్ పరిశ్రమ వద్దని వైసీపీ వాళ్లే చెప్పారని, పదవిలోకి రాకముందు ఒకమాట.. వచ్చాక ఒకమాట అనడం సరికాదన్నారు. దివిస్ పరిశ్రమకు 690ఎకరాలు ఇస్తే.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడు ప్రశ్నిస్తానని, జగన్, వైసీపీ నా శత్రువు కాదు.. దివిస్‌కు వ్యతిరేకం కాదని, సిద్దాంతాల కోసమే రాజకీయం చేస్తున్నానని పవన్ తెలిపారు.

పర్యావరణాన్ని రక్షిస్తూనే పరిశ్రమలు తీసుకురావాలన్న పవన్.. లాభాల కోసం లక్షల మందిని రోడ్లమీదకు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. లాభాల వేటలో విలువలను మరచిపోతున్నారని, ప్రజల కన్నీళ్లు తుడవడానికి జనసేన కార్యకర్తలు ముందుంటారన్నారు. నేను ఏదైనా అంటే వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అయినా నేను మాట తూలనని, నా తల్లిదండ్రులు నన్ను సంస్కారవంతంగా పెంచారని స్పష్టం చేశారు. దివిస్ పరిశ్రమ వల్ల విపరీతమైన కాలుష్యం వస్తుందని, పర్యావరణాన్ని నాశనం చేసే పరిశ్రమలు మనకు వద్దన్నారు.