కరీంనగర్‌లో ‘అంగడి’ ఆగమాగం.. ప్రాణాలు అరచేత పట్టుకుని..!

by  |
bazar
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే అంగడి (సంత) జాతీయ రహదారి పైన ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు, ప్రయాణికులు మాట్లాడుతూ.. శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించే ‘సంత’ ద్వారా వినియోగదారులు వారం సరిపడా కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుక్కుని వెళ్తుంటారు. మండలములోని కేశవపట్నం, మక్త, కన్నాపూర్, మొలంగూర్, కొత్తగట్టు, వంకాయ గూడెం, ఎరడపల్లి, కరీంపేట్, తాడికల్, తిమ్మాపూర్, సైదాపూర్ మండలాలకు చెందిన రైతులు, వ్యాపారులు ఈ అంగడిలో పాల్గొంటారు.

ఈ మార్కెట్‌కు స్థానికులే కాకుండా వివిధ మండలాలకు చెందిన ప్రజలు కూడా వస్తుంటం విశేషం. అయితే, జాతీయ రహదారిపై క్రయవిక్రయాలు కొనసాగుతుండటంతో వరంగల్ నుండి కరీంనగర్, కరీంనగర్ నుండి వరంగల్‌కు ప్రయాణించే భారీ వాహనదారులు, ద్విచక్ర వాహనాలతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సోమవారం అంగడిలో జనాలు కిక్కిరిసిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నది. కొన్నిమార్లు ప్రజలు రోడ్డు దాటే క్రమంలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకుంటుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాలను నడపాల్సి వస్తుందని డ్రైవర్లు, వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ రహదారిపై రవాణా సౌకర్యం మెరుగు పరచాలని కోరుతున్నారు. ఆ మార్కెట్‌ను ఖాళీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే జనాలతో పాటు వాహనదారులకు ఇబ్బంది లేకుండా, అందరికీ సురక్షితంగా ఉంటుందని వారు కోరారు.


Next Story

Most Viewed