అధికార పార్టీలో అసమ్మతి సెగలు: రాష్ట్ర కార్యదర్శి జోక్యం.. వాట్స‌ప్‌లో వివరణ

95

దిశ, భద్రాచలం: టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల చర్ల మండల కమిటీల ప్రకటనతో పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు. టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ పేరుతో సోమవారం విడుదలైన కమిటీల జాబితా సోషల్ మీడియాలో కనిపించగానే ఆ పార్టీ నాయకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. కోర్ కమిటీలో ఫైనల్ చేసిన పదవులు (అనుబంధ కమిటీలు) ఎలా మారుస్తారని పరోక్షంగా పార్టీ అధ్యక్షుడిని, ఆయన వర్గాన్ని ప్రశ్నిస్తూ కార్యదర్శి వర్గం నాయకుడు అరవింద్ వాట్సాప్  గ్రూపులో పోస్టింగ్ పెట్టారు. ఇది సోషల్ మీడియాలో షేర్ అవుతుండగానే పార్టీ నియోజకవర్గ కన్వినర్, రాష్ట్ర కార్యదర్శి డా. తెల్లం వెంకట్రావు జోక్యం చేసుకొని సోషల్ మీడియాలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలను చర్ల మండల అధ్యక్ష, కార్యదర్శిలు సోయం రాజారావు, నక్కినబోయిన శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో సెలక్షన్ చేసి నిర్ణయిస్తారని, అలా జరగని ఎడల రాష్ట్ర సెలక్షన్ కమిటీకి పంపిన తర్వాతే కమిటీలు ఫైనల్ అవుతాయని తెల్లం వెంకట్రావు వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. దీంతో కమిటీలు ఇంకా ఫైనల్ చేయలేదని స్పష్టం చేసినట్లైంది. అయితే ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సూచనతో రెండు గ్రూపుల నాయకులు ఏకాభిప్రాయంతో ఆమోదించిన అనుబంధ సంఘాల కమిటీల్లో పేర్లు కొన్ని మార్పుచేసి ప్రకటించిన కారణంగా కార్యదర్శి గ్రూపు నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తెల్లం వెంకట్రావు ఇచ్చిన వివరణ (పోస్టు) పదవులు పొందిన గ్రూపులో నిరుత్సాహం, పదవులురాని గ్రూపులో రెట్టింపు ఉత్సాహం కలిగిస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా చర్ల మండల టీఆర్ఎస్ పార్టీలో రగిలిన చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. నాయకుల వైఖరి మారకుండా పార్టీలో గ్రూపు విభేదాలు సమసిపోవడం కష్టమని గులాబీ కార్యకర్తలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..