హ్యాట్రిక్‌పై దీదీ కన్ను.. బెంగాల్‌లో బడా పోరు

by  |
all Parties
X

దిశ, నేషనల్ డెస్క్: దేశంలో మినీ సంగ్రామానికి నగారా మోగింది. నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అందరి దృష్టి పశ్చిమబెంగాల్‌పైనే ఉంది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఆశలు పెంచుకున్న బీజేపీ విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తున్నది. ఒకప్పుడు బెంగాల్ అంటే లెఫ్ట్‌ పార్టీలు అనిపించుకున్న వామపక్షాలు ఉనికిని చాటుకునే స్థితికి పడిపోయాయి. ఈ ఎన్నికలతో పూర్వ వైభవం పొందాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా పశ్చిమబెంగాల్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది. లెఫ్ట్‌కూటమి, కాంగ్రెస్ కలసి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రధాన పోటీ మాత్రం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు.

గతంలో దీదీ విజయ దుందుభి

2016లో మమతా బెనర్జీ విజయ దుందుభి మోగించారు. 2011 కంటే ఓట్లు సీట్లను గణనీయంగా పెంచుకుని ప్రతిపక్ష పార్టీలను మట్టికరిపించారు. 44.91శాతం ఓట్లతో 211 సీట్లతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 92 స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ 12.25శాతం ఓట్లతో 44 సీట్లను సొంతం చేసుకుని చెప్పుకోతగిన విజయం సాధించింది. లెఫ్ట్ పార్టీలు 203 స్థానాల్లో పోటీ చేసి 25.69శాతం ఓట్లతో 32 స్థానాల్లో విజయం సాధించారు. 28 సిట్టింగ్ స్థానాలను కోల్పోవడం గమనార్హం. బీజేపీ 291 స్థానాల్లో పోటీ చేసి మూడుసీట్లతోనే సరిపెట్టుకుంది. ఆ పార్టీకి 10.16శాతం ఓట్లు వచ్చాయి.

లోక్‌సభ ఎన్నికలతో మారిన తీరు

2019 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో పార్టీల పరిస్థితి తలకిందులైంది. 2014లో 34 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన టీఎంసీ 2019లో 22 ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కానీ, ఓటింగ్ శాతం పెంచుకుంది. ఆ పార్టీకి 43.3 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ ఆశ్చర్యకర ఫలితాలను సాధించింది. ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించింది. 40.7శాతం ఓట్లు రావడం గమనార్హం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కంటే దాదాపు 30 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లతోనే సరిపెట్టుకోగా, లెఫ్ట్‌ పార్టీలు ఖాతానే తెరవలేదు. పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం కోల్పోయాయి. లెఫ్ట్‌కూటమికి 6.33 శాతం ఓట్లు రావడం గమనార్హం.

హ్యాట్రిక్‌పై టీఎంసీ కన్ను

2011లో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టి మమతా బెనర్జీ తొలిసారి సీఎం అయ్యారు. వరుస విజయాల మీద ఉన్న దీదీ… బీజేపీ 2019లో సాధించిన విజయంతో మేలుకున్నారు. జాతీయస్థాయిలో బీజేపీ విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ‘మా, మాటి, మానుష్‌‌’నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. బెంగాల్ బేటీ (బెంగాల్ పుత్రిక)ని మరోసారి దీవించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. బీజేపీ హిందూ ఓట్లను పోలరైజ్ చేయకుండా ఉండటం కోసం సెక్యూలర్ భావాలను గట్టిగా వినిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. 30శాతం ఉన్న మైనార్టీ ఓట్లపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. హ్యాట్రిక్ విజయం సాధించాలని సర్వశక్తుల ఒడ్డుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కలవరపెడుతున్నది. కొందరు సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడటం ప్రతికూలంగా మారింది.

ఎలాగైనా గెలవాలని బీజేపీ

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీలో కొత్త ఆశలు రేకెత్తించాయి. రెండు సీట్ల నుంచి 18 సీట్లకు ఆ పార్టీ ఎదిగింది. భారీగా వచ్చిన ఓటింగ్ శాతం 2021 అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించేలా చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్‌పై దృష్టి సారించారు. తరుచూ ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయకుండా మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వచ్చారు. హిందువుల ఓట్ల పోలరైజేషన్‌పై దృష్టి సారించిన బీజేపీ దుర్గాపూజ, సరస్వతి పూజలను ప్రారంభించింది. ‘పరివర్తన్’ యాత్రలను చేపట్టింది. ‘అమర్ సోనా బంగ్లా’(బంగారు పశ్చిమబెంగాల్) నినాదంతో ఎన్నికల గోదాలోకి దూకుతున్నది. మమతా బెనర్జీ మరోసారి అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ నుంచి వలసలు పెరిగిపోతాయని ప్రచారం చేస్తున్నది. తమ పార్టీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నది. మమతకు ప్రత్యామ్నయ నేత బీజేపీలో లేకపోవడం ఆ పార్టీకి అతిపెద్ద లోపం. సీఎం అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి కూడా లేదు. ప్రగతిశీల పశ్చిమబెంగాల్‌లో హిందుత్వ నినాదం ఎంతవరకు సఫలీకృతమవుతున్నది అనుమానమే. దేశంలో అత్యధికంగా 30శాతం మైనార్టీ ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇదీ బీజేపీకి ప్రతికూలంశమే.

ఉనికి కోసం పోరాటం

లెఫ్ట్ పార్టీల పరిస్థితి ఒకరకంగా చెప్పాలంటే ఉనికి కోసం పోరాటమే. 37ఏండ్లపాటు పశ్చిమబెంగాల్‌ను కమ్యూనిస్టులు ఏలారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాట అటుంచితే గౌరప్రదమైన విజయం సాధించాలని లెఫ్ట్‌ పార్టీలు భావిస్తున్నాయి. కొన్నేండ్లుగా రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు ఏవీ లేవు. టీఎంసీ, బీజేపీ రెండూ ఆ పార్టీలకు బద్దశత్రులు. రెండింటికీ సమాన దూరం పాటిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 44 స్థానాల్లో విజయం సాధించింది. అంతకంటే మెరుగైన ఫలితాలను సాధించాలని ఆ పార్టీ భావిస్తున్నది. లెఫ్ట్ పార్టీలతో జతకట్టి పోటీ చేసే అవకాశం ఉన్నది.


Next Story

Most Viewed