నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు.. వీటిపైనే చర్చ!

by  |
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు.. వీటిపైనే చర్చ!
X

న్యూఢిల్లీ : బడ్జెట్ రెండో విడత పార్లమెంటు సమావేశాలు ఈ రోజు(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లోక్‌సభ చర్చలు జరగనున్నాయి. ఐదు అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ కాక మీదకు వస్తుండగా మరో వైపు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. దీంతో పార్టీల ఫోకస్ క్యాంపెయిన్ మీద ఉన్నప్పటికీ సభల్లోనూ ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ జరగనుంది. ముఖ్యంగా అధిక ధరలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సన్నద్ధమయ్యాయి. ఏ అంశం మీదైనా చర్చించడానికి సిద్ధమేనని, కానీ, 2021-22 గ్రాంట్ల డిమాండ్లకు, పన్ను సంస్కరణలకు సంబంధించిన ఆర్థిక బిల్లును ఆమోదించడానికి సహకరించాలని ప్రభుత్వపక్షమూ స్పష్టం చేసింది. ఈ సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగుతాయి.

ప్రభుత్వం అజెండా :

బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని, ఏ విషయంపైన అయినా చర్చించడానికి సిద్ధమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది వరకు స్పష్టం చేశారని పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ వివరించారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలప్‌మెంట్ బిల్లు, ఎలక్ట్రిసిటీ(సవరణ) బిల్లు, క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించనుంది.

ప్రతిపక్షం డిమాండ్లు :

పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం కోసం సోనియా గాంధీ సారథ్యంలో ఆదివారం సాయంత్రం కాంగ్రెస పార్లమెంటు నేతలు భేటీ అయ్యారు. సమావేశాల్లో ధరల పెరుగుదల, రైతుల ఆందోళన, భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. వీటన్నింటిపైనా చర్చకు డిమాండ్ చేస్తామని కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి వివరించారు.


Next Story

Most Viewed