ఏపీలో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్

by  |
ఏపీలో కొనసాగుతున్న రెండో విడత పోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు పోలింగ్ జరగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలతో పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

రెండో విడత ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్‌ జరగనుంది. వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. రెండో విడతలో భాగంగా 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా.. 539 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌ పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తున్నారు.


Next Story

Most Viewed