ఆక్సిజన్ అందక 26 మంది ప్రాణాలు గాల్లో..

by  |
ఆక్సిజన్ అందక 26 మంది ప్రాణాలు గాల్లో..
X

పనాజీ: తిరుపతిలోని రుయా ఆస్పత్రి ఘటన మరువక ముందే గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసీహెచ్)లో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 26మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తెల్లవారు జామున 2గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య జరిగినట్టు రాష్ట్ర ఆరోగ్యమంత్రి విశ్వజిత్‌ రాణే తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని ఒప్పుకున్న రాణే.. మరణాలకు మాత్రం కచ్చితమైన కారణాలు తెలియరాలేదని వెల్లడించారు. మే 10 నాటికి ఈ ఆస్పత్రికి 1200 జంబో ఆక్సిజన్ సిలిండర్లు అవసరముండగా, 400 సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపించాలని హైకోర్టును కోరారు. అయితే, ఆక్సిజన్ అందకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని మృతుల బంధువులు వాపోతున్నారు.

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు: సీఎం

ఘటన జరిగిన అనంతరం జీఎంసీహెచ్‌ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, కానీ, దానిని కొవిడ్ వార్డులకు సరైన సమయానికి చేరవేయడంలో ఆటంకం ఏర్పడి ఉంటుందని తెలిపారు. ఈ కారణంగానే పేషెంట్లలో ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. దీనిని అధిగమించేందుకు వార్డులవారీగా పర్యవేక్షణ సిబ్బందిని ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.


Next Story