24 మంది వలస కూలీలను వెంటాడిన మృత్యువు

by  |
24 మంది వలస కూలీలను వెంటాడిన మృత్యువు
X

లక్నో : ఇంటికి చేరాలనే వలస కూలీల కలలు కల్లలవుతున్నాయి. సొంతూరుకు బయల్దేరిన వీరి ప్రయాణాలు విషాదాంతంగా మిగులుతున్నాయి. సొంతూరు చూడకముందే మార్గమధ్యంలోనే అర్థాంతరంగా అనారోగ్యంతోనో.. లేక ప్రమాదాల్లోనో ప్రాణాలు కోల్పోతున్నారు. మహారాష్ట్రలో ట్రాక్‌పై నిద్రిస్తున్న 16 మంది వలస కార్మికులను గూడ్స్ ట్రైన్ పొట్టనబెట్టుకున్న ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్‌లో తాజాగా, మరో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువు మరో 24 మంది వలస శ్రామికులను కబళించింది. ఔరాయా జిల్లాలో హైవేపై వలస కూలీలను తీసుకెళ్లుతున్న రెండు ట్రక్కులు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు.

రాజస్తాన్, హర్యానా నుంచి కొందరు వలస కూలీలు ఒక ట్రక్కులో.. ఢిల్లీ నుంచి ఇంకొందరు మరో ట్రక్కులో స్వగ్రామానికి బయల్దేరారు. వీరంతా.. ఉత్తరప్రదేశ్‌లోని రెండు జిల్లాలు.. అలాగే, బీహార్, జార్ఖండ్, బెంగాల్‌లలోని సొంతూళ్లకు ప్రయాణం కట్టారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి బయల్దేరిన ప్రయాణికులు ఔరాయా జిల్లా మిహౌలీ ఏరియాలోని ఓ ధాబా వద్ద టీ తాగడానికి ట్రక్కును ఆపారు. కాగా, అదే దారిలో సుమారు 50 మంది వలస కూలీలు.. గోనె సంచుల స్టాక్‌తో.. రాజస్తాన్ నుంచి మరో ట్రక్కు బయల్దేరింది. ఇందులో కూలీలు గోనె సంచులపైనా కూర్చున్నారు. అయితే, ఈ ట్రక్కు ధాబా ముందు ఆగిన ట్రక్కును ప్రమాదవశాత్తు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఢీకొట్టింది. దీంతో ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న కార్మికులు గోనె సంచులతో పాటుగా ఎగిరి బయటపడ్డారు. దీంతో 24 మంది బడుగులు తమ ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వరకు గాయాలపాలయ్యారు. 24 మంది ఆసుపత్రికి వచ్చేలోపే చనిపోయారని ఔరాయా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అర్చన శ్రీవాస్తవ తెలిపారు. 22 మందిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారని వివరించారు. కాగా, విషమంగా ఉన్న 15 మంది క్షతగాత్రులను సాయ్‌ఫై పీజీఐ ఆసుపత్రిలో చేర్చారని చెప్పారు.

మృతుల కుటుంబాలకు మోడీ సానుభూతి

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘ఉత్తరప్రదేశ్‌లోని ఔరాయా జిల్లాలో చోటుచేసుకున్న ఘటన అత్యంత విషాదకరం. ప్రభుత్వం సహాయక పనుల్లో నిమగ్నమైంది. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి ప్రకటిస్తున్నా.. అలాగే, క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఈ ప్రమాదంలో వలస కూలీలు మృతి చెందడం దురదృష్టకరం.. బాధాకరమని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. బాధాతప్త కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులను కాపాడేందుకు మెడికల్ సిబ్బందికి, సహాయక సిబ్బందికి సూచనలను చేసినట్టు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు వివరించారు. మృతుల కుటుంబానికి రూ. 2 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ. 50వేల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసింది. అనంతరం రెండు ట్రక్కులను సీజ్ చేసిన అధికారులు.. డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.


Next Story