బ్లాక్ ఫంగస్ రోగుల కోసం ఉస్మానియాను కేటాయించేనా..?

by  |
Koti ENT Osmania Hospital
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్య సేవలందించుందుకు ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వినబడుతోంది. కొవిడ్ బారిన పడి కోలుకున్న అనంతరం డయాబిటిస్ అదుపులో ఉంచుకోలేని వారు బ్లాక్ ఫంగస్ కు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులు అధికంగా నమోదవుతుండడంతో ఈ నెల 15వ తేదీన కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగస్ రోగుల కోసం నోడల్ హాస్పిటల్ గా ప్రభుత్వం ప్రకటించింది. 16వ తేదీ నుండి ఆస్పత్రిలో వైద్య సేవలు మొదలయ్యాయి.

మొదట్లో అంతంత మాత్రంగానే రోగుల తాకిడి ఉండగా ప్రస్తుతం ఊహించని విధంగా రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుండి కూడా రోగులు వైద్యం నిమిత్తం వస్తున్నారు. ఈఎన్టీ ఆస్పత్రిలో మొత్తం 200 పడకలు ఉండగా వీటికి అదనంగా మరో 30 పడకలను అందుబాటులోకి తెచ్చింది. అయినా ఈ పడకలు ఏ మూలకు సరిపోవడం లేదు. ఆస్పత్రి ఆవరణలో రోగులు పడకలు, వైద్యం కోసం పడిగాపులు గాస్తున్నారు. అంతేకాకుండా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ , వైద్య నిపుణుల సేవల కోసం ఉస్మానియా ఆస్పత్రికి, ల్యాబ్ లకు తిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి ప్రత్యామ్నాయంగా మరో హాస్పిటల్ ను అందుబాటులోకి తేవాలనే డిమాండ్లు రోగులు, వారి సహాయకుల నుండి వస్తున్నాయి.

రోగుల బాధలు వర్ణనాతీతం

రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ రోగులు పెరుగుతుండడం, ఈఎన్టీ ఆస్పత్రిలో ప్రత్యామ్నాయంగా వందల సంఖ్యలో మంచాలు పెంచే అవకాశం లేకపోవడంతో రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. ప్రతినిత్యం వందల సంఖ్యలో రోగులను మంచాలు లేవనే కారణంగా తిప్పి పంపుతున్నారు. కొంత మంది రోగులు ప్రతినిత్యం ఆస్పత్రి ఆవరణలోనే రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇలా వందల సంఖ్యలో రోగులు వస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగుల రద్దీకి తగ్గట్లుగా అదనంగా మంచాలను అందుబాటులోకి తేవాల్సి ఉండగా అధికారులు కేవలం 30 అదనపు పడకలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.

ఉస్మానియా పాత భవనంతో సమస్యలకు చెక్…

వర్షం నీరు వచ్చి చేరిందనే కారణంతో ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని గత కొన్ని నెలలుగా మూసి ఉంచారు. ప్రస్తుతం ఈ భవనం ఖాళీగా ఉంది. భవనం మొదటి, రెండు అంతస్తుల్లో ఫ్లోర్ కు 300 చొప్పున 600 మంచాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందులో బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్య చికిత్సలు అందిస్తే త్వరలో వ్యాధి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఈఎన్టీ ఆస్పత్రిలో భవనం, వైద్యులు, సిబ్బంది, ల్యాబ్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అధికంగా మరో వంద పడకలకంటే ఎక్కువ ఏర్పాటు చేసే అవకాశం లేదు. దీనికితోడు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ ల కోసం కూడా ఉస్మానియా ఆస్పత్రికి రోగులను పంపుతున్నారు.

ఉస్మానియా నుండే మెడిసిన్, ఎండోక్రనాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల వైద్యులు ఈఎన్టీకి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో ఉస్మానియా పాత భవనాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధి అదుపులోకి వచ్చేంత వరకు అందుబాటులోకి తెస్తే సమస్యకు చెక్ పెట్టినట్లుగా ఉంటుంది. అంతేకాకుండా ఉస్మానియా ఓపీ, క్యూడీసీ భవనాలలో వైద్యం పొందుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పక్క నుండి ఉన్న గేటు ద్వారా బ్లాక్ ఫంగస్ రోగులు ఉస్మానియా పాత భవనానికి రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.


Next Story

Most Viewed