ఇష్యూ డైవర్ట్.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్

by  |
ఇష్యూ డైవర్ట్.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ వ్యూహంలో ప్రతిపక్షాలు చిక్కాయా..? పక్కా ప్లాన్‌తో ఒకే అంశంపై అందరి దృష్టి ఉండేలా ప్లాన్​ చేస్తున్నారా..? ఈ ప్లాన్‌లో అధికార పార్టీ సక్సెస్ అయిందా అంటే అవుననే చెప్పుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే మండలి ఎన్నికల వేళ కేవలం సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రతిపక్షాలను ఆ చక్రంలోనే బంధీ చేస్తొంది గులాబీ దళం. ఇది కచ్చితంగా టీఆర్ఎస్ వేసిన ప్లాన్‌లో భాగమేనని, ఒక విధంగా ఒకే చక్రంలో ప్రతిపక్షాలను ఉంచి మండలి ఎన్నికల్లో మిగిలిన అంశాలపై గులాబీ దూకుడు పెంచుతోంది. ఇది ఏమాత్రం పట్టని విపక్షాలు, స్వతంత్రులు, మేధావి వర్గం ఒక్కటే పట్టుకుని సాగదీస్తోందని రాజకీయ విశ్లేషకులు వర్ణిస్తున్నా… పాపం పనికిరాని ముచ్చటే అవుతోంది.

సూపర్ ప్లాన్

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు, తెలంగాణ ఉద్యమకారులను అధికార పార్టీ పక్కా ప్లాన్​ ప్రకారం బంధీ చేస్తోంది. అదే ఉద్యోగాల భర్తీ అంశం. ఇప్పటివరకూ ఉద్యోగాల భర్తీపై ఎక్కడా ప్రస్తావించని అధికార పార్టీ ఒక్కసారిగా లెక్కలు బయటకు తీసింది. అంతేగాకుండా మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ లెక్కలను ప్రకటించారు. గతంలో మంత్రులు హరీష్​రావు, ఈటల రాజేందర్, మరోక్కరో ఉద్యోగాల భర్తీపై వివరణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం మంత్రి కేటీఆర్ రంగంలోకి వచ్చారు. ఎందుకంటే మంత్రి కేటీఆర్ వచ్చిన తర్వాత.. పార్టీలోని ప్రతిఒక్కరూ దానికి కోరస్ పాడాల్సిందే కదా… మా మంత్రి చెప్పింది వందశాతం కరెక్ట్.. లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చాం.. మేం సవాల్ చేస్తున్నాం.. మీ హయాంలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అంటూ ఇతర మంత్రులు, నేతలు, ప్రజాప్రతినిధులు ఎదురుదాడి మొదలుపెడుతారు. దీంతో ప్రతిపక్షాలు ఇక్కడే ఉంటాయి. ఈ ఇష్యూ నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులను కల్పిస్తున్నారు. ఇప్పుడు మంత్రి హరీష్​రావుపై ఒకరు, తలసానిపై ఒకరు ఇలా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. నిన్నటిదాకా మంత్రి కేటీఆర్‌కు సవాల్​ విసిరారు. ఇప్పుడు మంత్రి తలసాని వంతు అయింది. రేపుమాపో అక్కడ మంత్రి గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్​రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇలా.. ఎవరో ఒకరు దీనిపై సవాల్‌కు సిద్ధమా అనడం.. కాంగ్రెస్, బీజేపీ నేతలు, మేధావులు, స్వతంత్రులుగా పోటీ ఉన్న ఉద్యమకారులు మేం సిద్ధం అంటూ ఒకరి వెంట ఒకరు పడటం మామూలే. దీంతో ఇష్యూ మొత్తం డైవర్ట్​ అయినట్టే. ఇక ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లతోనే ప్రచారకాలం ముగిసిపోతోంది. అప్పుడు ఒక్కరు కూడా మాట్లాడరు. మళ్లీ ఎప్పటికో ఉద్యోగాల భర్తీ అంశం తెరపైకి వస్తోంది.

“అదేదో చరిత్రలో బ్రహ్మాణుడి చేతిలో మేకపిల్ల కాదు.. కుక్కపిల్ల అనే కథను ఇప్పటి నేతలకు అనువదిస్తున్నారు. ఏదో పూజ అనంతరం బ్రహ్మణుడికి దానం చేసిన మేకపిల్లను కొట్టేసేందుకు వరుసగా నలుగురు దొంగలు కూడబల్కుని ఒకరి వెంట ఒకరు వచ్చి పంతులుగారు… కుక్కను పట్టుకుని వెళ్తున్నారు అంటూ ఎగతాళి చేయడంతో.. ముందు ముగ్గురికి సమాధానం చెప్పిన సదరు బ్రహ్మణుడు నాలుగోసారికి అనుమానం వచ్చి మేకపిల్లను వదిలేసి వెళ్లినట్లుగా” ఇప్పుడు కూడా లక్షా 32 వేల ఉద్యోగాల భర్తీపై మంత్రుల నుంచి కిందిస్థాయి నేతల వరకు ఒకటే పదం ఎత్తుకోవడంతో అది నిజమనే భావన ఇప్పుడు నిరుద్యోగుల్లో కూడా వస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షాల సవాళ్లతో “కొన్ని ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి” అంటూ అక్కడక్కడా ముసుగులో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు సమర్ధిస్తూనే ఉన్నారు. ఇది మరింత ముదిరి నిజమే.. ఉద్యోగాలు వచ్చాయంటూ బయట పార్టీ కాదంటూ ఉన్నా.. టీఆర్ఎస్ కండువా కింద ముసుగు వేసుకుని ఉన్న వారు ప్రచారం చేస్తూనే ఉంటారు. దీంతో గులాబీలకు లాభమే. చాలా సమస్యలు, అంశాలపై మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు మాత్రం టీఆర్ఎస్ చక్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇది గులాబీ బాస్ ముందు నుంచీ చేస్తున్న ప్రయోగమే.. ఇప్పుడు కూడా అదే.

చాలా సమస్యలున్నాయి..!

ఉద్యోగాల భర్తీపై వీరందరినీ చక్రంలో బంధించిన టీఆర్ఎస్.. రెండు నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేసింది. కొత్త ఉద్యోగాలు, పరిశ్రమల కల్పన, నిరుద్యోగభృతి, యువత కుటుంబాల్లో కొత్త పెన్షన్లు, రైతుబంధు వంటి అంశాలను చూపిస్తూ ప్రచారం చేసుకుంటోంది. విద్యాసంస్థల యజమానులే టీఆర్ఎస్ నేతలుగా ఉన్నప్పటికీ.. విద్యా సంస్థల్లో లాక్​డౌన్​నుంచి కనీసం జీతాలు కూడా ఇవ్వలేదనే ప్రచారాన్ని తీసుకోవడంలో విపక్షాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. స్థానికంగా ఉండే సమస్యలను కూడా చూపించలేకపోతున్నారు. ఒక్కటే అంశాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. కానీ టీఆర్ఎస్ మాత్రం వారి ప్లాన్​సక్సెస్​అయినందుకు ఓవైపు సంతోషిస్తూనే.. అటు ప్రచారంలో వేగం పెంచింది.

గంపగుత్తగా ఒప్పందాలు

మరోవైపు ప్రతిపక్షాలను ఇటువైపు పరిమితం చేసిన టీఆర్ఎస్.. అటువైపు విద్యా సంస్థలు, యువజన సంఘాల వారీగా గంపగుత్త బేరాలు చేస్తోంది. ఇవి ఓట్లుగా మారుతాయా లేదా అనే అంశం పక్కనపెడితే… గంపగుత్తగా ఒప్పందాలు చేసుకుంటోంది. చిన్న చిన్న విద్యా సంస్థల యజమానులతో మాట్లాడుతూ.. ఓట్లను రాబట్టుకుంటోంది. అసలే అధికార పార్టీ కదా.. ఎంతో కొంత పని ఉంటుందనే కారణంతో పాటుగా విపక్షాలు, మేధావుల నుంచి ఎవరూ ముందుకు రాకపోవడంతో టీఆర్ఎస్‌కు ఓటేస్తామని మాట ఇస్తున్నారు. కనీసం అటువైపు వెళ్లి ఓట్లను తీసుకోవడంలో ప్రతిపక్షాలు ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే ఇలాంటి ఆలోచన రాకుండా వారిని టీఆర్ఎస్ కట్టి పడేసింది.


Next Story

Most Viewed