ఐటీ దాడులను ఖండించిన ప్రతిపక్షాలు

51
dainika-bhaskar 1

న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా గ్రూపు దైనిక్ భాస్కర్‌‌తో పాటు, యూపీ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ సమాచార్ న్యూస్ ఛానల్ పైనా ఐటీ దాడులు జరిగాయి. పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న అభియోగాల మేరకు ఆయా సంస్థలపై గురువారం ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువారం ఉదయం 5.30 గంటల నుంచే ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలల్లో మొత్తం 30 చోట్ల అధికారులు దాడులు జరిపారు. భారత్ సమాచార్ ఛానల్‌ లక్నో కార్యాలయంతో పాటు, ఆ ఛానల్ ఎడిటర్ ఇంటిపైనా అధికారులు దాడులు చేశారు. కాగా కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని ఆయా మీడియాల్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం చేయడంతోనే ఈ దాడులు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నరేంద్ర మోడీ వైఫల్యాలను ఎత్తిచూపినందుకు రెండు మీడియా సంస్థలు మూల్యం చెల్లించుకుంటున్నాయని పేర్కొన్నాయి.

మీడియాను బెదిరించే ప్రయత్నాలు: కేజ్రీవాల్

మీడియా సంస్థలపై జరిగిన ఐటీ దాడులపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. మీడియాను బెదిరించే ప్రయత్నాలుగా దాడులను ఆయన అభివర్ణించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మట్లాడే ప్రయత్నం చేసినా వారిని వదిలిపెట్టబోమనే సందేశాన్ని ఈ దాడుల ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు.


దాడులు కక్షపూరిత చర్య: మమతా బెనర్జీ

ఈ కక్షపూరిత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వాస్తవాలను వెలికి తీసే మీడియా సంస్థల గొంతునులిమే ప్రయత్నంగా అభివర్ణించారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలను బలహీనపరిచే చర్య అని ఆమె మండిపడ్డారు.


మీడియా గొంతు నొక్కే చర్య: అశోక్ గెహ్లాట్

దైనిక్ భాస్కర్ వార్తాపత్రిక, భారత్ సమాచార్ ఛానల్ పై ఐటీ శాఖ దాడులు మీడియా గొంతును నొక్కె ప్రయత్నమని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. ఇసుమంత విమర్శను కూడా మోడీ ప్రభుత్వం తట్టుకోలేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీది ఫాసిస్టు మెంటాలిటీ అని అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో వాస్తవాలను చూడటానికి కూడా బీజేపీ సిద్ధంగా లేదని వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..