Turkey Consulate: టర్కీ నీచ బుద్ధి.. హైదరాబాద్‌లోని టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌‌లో ఉన్న రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు.

Turkey Consulate: టర్కీ నీచ బుద్ధి.. హైదరాబాద్‌లోని టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌‌లో ఉన్న (Consulate General of Turkey) రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా భారత్ సరిహద్దులో పాకిస్థాన్‌కు చెందిన 400 డ్రోన్‌లను భారత్ సమర్ధవంతంగా పేల్చిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌కు టర్కీ డ్రోన్‌లు అందజేసిందని అధికారి కల్నల్ సోఫియా కురేషి తాజాగా స్పష్టం చేశారు. ఆ టర్కిష్ (Turkey Drones) డ్రోన్‌లను గగనతలంలోనే ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్‌తో పాటు టర్కీపై కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే పాకిస్తాన్‌కు టర్కీ ఎలా మద్దతుగా నిలుస్తోందని దేశప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు విధించారు. భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో (India-Pakistan border) యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ తిప్పి కొడుతోంది. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టిన తర్వాత పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. భారత సైన్యాన్ని నేరుగా ఎదుర్కోలేమని గ్రహించిన పాక్ ఇక్కడే తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్.. భారత్ పైకి ఏకంగా 400 డ్రోన్లతో దాడులకు తెగబడటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంత మొత్తంలో డ్రోన్ల సరఫరా వెనుక టర్కీ ఉందని చర్చ తెరపైకి వచ్చింది.

అయితే టర్కీలో 2023లో వచ్చిన భూకంపం తర్వాత, భారతదేశం ఆపరేషన్ దోస్త్ పేరుతో ఆదేశానికి సహాయం అందించింది. భూకంపం బాధితులకు వైద్యం అందించడానికి ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు చేసింది. భారత్ తన వంతుగా టర్కీకి భారీ స్థాయిలో సహాయం అందించినా.. టర్కీ ఇలా నీచ బుద్ధి ప్రదర్శించడం ఏమిటని భారత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story