- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: సరిహద్దుల్లో నిశ్శబ్దం.. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక మౌనం!
భారత్ పాక్ సరిహద్దుల్లో నిశ్శబ్ధం నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాక్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారంరోజులుగా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్న సరిహద్దు ప్రాంత ప్రజలు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత జనావాసాలే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులతో కంటిమీద కునుకు లేకుండా గడిపారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా పాక్ డ్రోన్లతో దాడులకు పాల్పడటం అక్కడి ప్రజలను మరింత టెన్షన్ పెట్టింది. అయితే వాటిని భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పరిస్థితి అంతా కంట్రోల్‌లోనే ఉన్నప్పటికీ అర్థరాత్రుల్లో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ ప్రజల్లో కనిపించింది. కానీ నిన్న రాత్రి 11 గంటల తర్వాత కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఏ సెక్టార్ నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదని అధికారులు తెలిపారు. దీంతో ఇవాళ తెల్లవారుజాము నుంచి శ్రీనగర్, ఉధంపూర్, బారాముల్లా, ఉరి, పూంచ్ సెక్టార్లలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రిపూట ఎలాంటి కాల్పులు, డ్రోన్ల దాడులు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. వాహనాలు యధావిధిగా తిరుగుతున్నాయి. వ్యవసాయదారులు, పశువుల కాపరులు తన రోజువారి పనులకు వెళ్తూ కనిపించారు. మరోవైపు సరిహద్దు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ విధించారు. పంజాబ్‌లోని పఠాన్ కోట్, ఫిరోజ్‌పూర్, అమృత్‌సర్, రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లాల్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరు దేశాల వ్యూహాత్మక మౌనం..
తీవ్రమైన ఉద్రిక్తతల మధ్య ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అమెరికా నిన్న దౌత్య ప్రయత్నాలు చేసింది. దీంతో డీజీఎంవోల స్థాయిలో జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు అంగీకరం జరిగినా గంటల్లోనే పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది. పాక్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. ఎలాంటి దాడులు జరిపినా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో తొలుత డ్రోన్‌లతో దాడులకు తెగబడిన పాక్ ఆతర్వాత సైలెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఇరు దేశాలు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం, పాక్ ఉల్లంఘనల నేపథ్యంలో మరి కాసేపట్లో రక్షణ, విదేశాంగ శాఖల ప్రెస్‌మీట్ నిర్వహించబోతోంది. ఆ తర్వాతే యుద్ధ పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






