Pahelgam Attack: టీఆర్ఎఫ్ పై అంతర్జాతీయంగా ఉచ్చు బిగిస్తున్న భారత్

by Prasad Jukanti |

పహెల్గాం ఎటాక్ కు పాల్పడిన టీఆప్ఎఫ్ సంస్థపై భారత్ ఉచ్చు బిగిస్తోంది.

Pahelgam Attack: టీఆర్ఎఫ్ పై అంతర్జాతీయంగా ఉచ్చు బిగిస్తున్న భారత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్ముకశ్మీర్ పహెల్గాంలో (Pahelgam Attack) జరిగిన ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాక్, పీవోకే భూభాగంలోని ఉగ్రశిబిరాలపై కొరడా ఝుళిపించింది. ఈ క్రమంలో ఈ దాడికి పాల్పడిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ (TRF) పై గట్టి చర్యలకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీఆర్ఎఫ్ సంస్థను ఐక్యరాజ్యసమితి (UN) ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రసంస్థల జాబితాలో చేర్చేలా భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు తాజాగా న్యూయార్క్ లో ఉన్న భారత ప్రతినిధుల బృందం కౌంటర్- టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులను కలిసింది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కార్యాలయం, ఉగ్రవాద నిరోధక కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ తో కూడా సమావేశమై టీఆర్ఎఫ్ సంస్థ విషయాన్ని ప్రస్తావించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

తొలుత బాధ్యత ఆపై బుకాయింపు:

పహెల్గాం దాడిని తామే చేసినట్లు తొలుత ప్రకటించిన టీఆర్ఎఫ్ ఆ తర్వాత ఈ దాడి మేము చేయలేదంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ ఈ దాడికి పాల్పడింది ఈ సంస్థేనని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ సంస్థ పాకిస్తాన్ కు చెందిన లష్కర్ ఏ తోయిబాకు అనుబంధ సంస్థగా 2019 అక్టోబర్ లో ఉద్భవించింది. ఈ సంస్థకు ఉగ్రవాది షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్ గా, చీఫ్ ఆపరేషనల్ కమాడర్ గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎఫ్ ను భారత్ ప్రభుత్వం ఉగ్ర సంస్థగా ప్రకటిస్తూ 6 జనవరి 2023న గెజిట్ నోటిఫికేషన్ జారి చేసింది.

Next Story