Amit Shah: భారత్‌ వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

by Shamantha N |

ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితికి స్పందించడానికి సిద్ధంగా ఉండాలని కోరారు.

Amit Shah: భారత్‌ వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితికి స్పందించడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. జమ్ముకశ్మీర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు, సిక్కిం ప్రభుత్వ ప్రతినిధితో అమిత్ షా సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్ జరిగిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌ వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దవని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని ఆదేశించింది. నకిలీ కథనాలను ప్రచారం చేసే ఖాతాలను బ్లాక్‌ చేయాలని సూచించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దేశ వ్యతిరేక ప్రచారంపై కఠినంగా నిఘా ఉంచాలని అధికారులను కోరారు. తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర సంస్థలతో సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

సాయుధ దళాలను అభినందించిన ప్రభుత్వం

సమావేశంలో, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో సాయుధ దళాలను ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రప్రభుత్వం అభినందించింది. ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉద్భవించిన జాతీయ ఐక్యత స్ఫూర్తి పౌరుల మనోధైర్యాన్ని పెంచిందని అమిత్ షా నొక్కి చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, అగ్నిమాపక వంటి ముఖ్యమైన సేవలను నిరంతరాయం కొనసాగించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. నిత్యవసరాల వస్తుసేవలకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. విపత్తు ప్రతిస్పందన బృందాలు, పౌర రక్షణ సిబ్బంది, హోమ్ గార్డ్‌లు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Next Story