Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో బిగ్ ట్విస్ట్.. ట్రంప్ తీరుతో పొలిటికల్ దుమారం

by Prasad Jukanti |

ఇండియా పాక్ మధ్య ఆపరేషన్ సిందూర్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో బిగ్ ట్విస్ట్.. ట్రంప్ తీరుతో పొలిటికల్ దుమారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పీవోకే భూభాగంపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఆపరేషన్ కొనసాగుతున్న తరుణంలో అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడం, ఇంతలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కశ్మీర్ సమస్య పరిష్కారం వ్యాఖ్యలు భారత్ లో రాజకీయ దుమారం రేపుతోంది. ట్రంప్ చేసిన ట్వీట్ అనేక ప్రశ్నలకు తావిస్తోందని అందువల్ల వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను అత్యవసరంగా సమావేశపరచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, పాక్ సీజ్ ఫైర్ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది.

ట్రంప్ ఏమన్నారు:

ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకునే జ్ఞానం ఇరు దేశాలు కలిగి ఉన్నాయని దాడులు ఆపాల్సిన సమయం ఆసన్నమైందని ఇరు దేశాలు గుర్తించాయని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పరస్పర దాడులు పౌరుల మరణాలు, వినాశనానికి దారి తీస్తాయని చరిత్రాత్మక నిర్ణయంలో అమెరికా సహాయపడినందుకు గర్వపడుతున్నానన్నారు. ముందస్తుగా చర్చించకపోయినా రెండు దేశాలతో వాణిజ్యాన్ని పెంచబోతున్నాం. వెయ్యేళ్ల తర్వాతైనా కశ్మీర్ విషయంలో పరిష్కారం లభిస్తుందో లేదో? కానీ కశ్మీర్ విషయంలో పరిష్కారం కోసం రెండు దేశాలతో కలిసి పని చేస్తానన్నారు. ట్రంప్ చేసిన ఈ పోస్టుతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొత్త అంశంపైకి మళ్లినట్లైంది. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మొదలైన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ లో తిష్టవేసిన ఉగ్రస్థావారాలను భారత సైన్యం నేలకూల్చింది. ఈ క్రమంలో పాకిస్తాన్ భారత్ పైకి దాడులకు దిగడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారి ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం కమ్ముకుంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందం జరగడం ఇంతలో కశ్మీర్ అంశం తెరపైకి రావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.

ప్రతిపక్షాల విమర్శలు:

కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ స్పందించారు. ‘ఈ ట్వీట్‌పై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సీజ్ ఫైర్ ఒప్పందం వెనకు ఏం జరిగింది? ఎలా, ఎందుకు, దీనికి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఎలాంటి విమర్శలు చేయబోం. ప్రభుత్వ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాన్ని మాత్రమే కోరుతున్నామన్నారు. అదే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండి ఉంటే అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యేవారని, ప్రత్యేక సమావేశాన్ని కూడా పిలిచి ఉండేవారని నాకు నమ్మకం ఉన్నది’ అంటూ కామెంట్స్ చేశారు. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. కాశ్మీర్ పై పరిష్కారం కనుగొనడానికి అమెరికా లేదా మరే ఇతర దేశం జోక్యం అవసరం లేదని కామెంట్ చేశారు. ఏ దేశం జోక్యం లేకుండానే భారత దేశం సవాలును ఎదుర్కోవాలని ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై సమగ్రంగా చర్చించేందుకు ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని పిలవడంతో పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సంభాషణ కోసం "తటస్థ ఫోరమ్" గురించి ప్రస్తావించడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని సిమ్లా ఒప్పందాన్ని విరమించుకున్నామా? మేము మూడవ పక్షం మధ్యవర్తిత్వానికి తలుపులు తెరిచామా? అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు.

మోడీ నిర్ణయంపై ఉత్కంఠ:

ట్రంప్ కశ్మీర్ అంశంలో జోక్యం వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. నిజానికి ట్రంప్ తన తొలి విడత పాలన సమయంలో కూడా కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి రెడీ అయ్యారు. ఈ అంశాన్ని నాటి పాక్, భారత్ ప్రధానుల వద్ద ప్రస్తావించారు. కానీ ఈ అంశంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ సున్నితంగా తిరస్కరించింది. ఆ తర్వాత ఈ విషయంలో సైలెంట్ అయిన ట్రంప్ అనూహ్యంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రస్తావించడం ఆసక్తిగా మారింది. మరి ఈసారి భారత ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతున్నది అనేది సస్పెన్స్ గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో ట్రంప్ ఆలోచనపై ఏదైనా చర్చ జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Next Story