కరోనాతో ఆన్‎లైన్‎లోనే కోచింగ్

by  |
కరోనాతో ఆన్‎లైన్‎లోనే కోచింగ్
X

దిశ, హైదరాబాద్: ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా యావత్తు సమాజం క్వారంటైన్ కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు తదితర ఎక్కువ మంది ప్రజలు ఒకేచోట గుమిగూడి ఉండే ప్రదేశాలు ప్రాంతాల్లోనూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‎కు అనుమతి ఇచ్చాయి. ఇదే పద్దతిని ఆచరించేందుకు చాలా సంస్థలు యోచిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఇటీవలనే ఇంటర్ పరీక్షలు ముగిసాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి పలు ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. వీటితో పాటు మరో రెండు నెలలో సివిల్స్ -2020 ప్రిలిమ్స్ పరీక్షలు ఉన్నాయి. వీటికోసం విద్యార్థులు ఆయా కోచింగ్ సెంటర్లలో ప్రత్యేక శిక్షణ పొందుతుంటారు. ఇప్పటికే ప్రయివేటు కోచింగ్ సెంటర్లతో పాటు వర్కింగ్ హాస్టల్స్ కూడా మూత పడ్డ సంగతి తెల్సిందే. దీంతో విద్యార్థులంతా హాస్టళ్ళను ఖాళీ చేసి వారి వారి సొంత గ్రామాలకు వెళ్ళారు.

ఆన్‎లైన్‎లోనే శిక్షణ..

ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఐఐటీలో చేరేందుకు లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాసేందుకు సిద్దం అవుతున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 5 నుంచి 9వ తేదీ వరకూ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. కరోనా ప్రభావంతో ఈ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఇదిలా ఉండగా, జేఈఈ కొంత కఠినతరమైన ఎంట్రన్స్ కావడంతో విద్యార్థులు ఆయా పేరొందిన కోచింగ్ సెంటర్లలో శిక్షణ నిమిత్తం ఇప్పటికే ఫీజులు చెల్లించి ఉన్నారు. దీంతో పాటు ఆయా సెంట్రల్ యూనివర్సిటీలు, గురుకుల డిగ్రీ ప్రవేశాలకు, పాలిటెక్నిక్, లా సెట్, తదితర ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రస్తుతం విద్యా సంస్థలన్నింటికీ సెలవులు ఉన్నందున ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోచింగ్ సెంటర్లు సైతం మూతపడ్డాయి. అయినా కూడా కోచింగ్ సెంటర్లు మాత్రం ఆన్ లైన్ శిక్షణకు శ్రీకారం చుట్టాయి. ఫీజు చెల్లించిన వారికి ఆన్ లైన్ శిక్షణకు ప్రత్యేక పాస్ వర్డ్ కేటాయించారు. దీంతో కోచింగ్ నిర్వాకులు నిర్ధేశించిన సమయాలలో ఆన్ లైన్ ద్వారా పాస్ వర్డ్ ద్వారా భోధనాంశాలను విద్యార్థులు వింటున్నారు. అందుకోసం ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన ఆండ్రాయిడ్ మొబైల్, ల్యాప్ టాప్, ట్యాబ్ లేదా కంప్యూటర్లలో పాఠాలు వినడానికి అవకాశం ఉంది. అయితే, బోదనా సమయం ముగిసిన అనంతరం కేటాయించిన సమయంలో విద్యార్థులు తమ సందేహాలను తీర్చుకోవడానికి కూడా వీలు కల్పించారు.

tag: corona effect, online, coaching centers, hyderabad


Next Story

Most Viewed