ఆన్ లైన్ లో అవధానం చేయడం ఎలాగో తెలుసా?

by  |
ఆన్ లైన్ లో అవధానం చేయడం ఎలాగో తెలుసా?
X

దిశ, కరీంనగర్:
సాధారణంగా అవధానం అంటే సాహితీ వేదికలపైనో లేదా సభాస్థలిలోనో జరుగుతోంది. కానీ, ఇప్పుడు ఆన్‌లైన్‌లో జరుగుతోంది. అదేంటీ..ఆన్ లైన్‌లో జరగడమేంటీ..? అనుకుంటున్నారా.. అవునండీ.. మీరు చదివింది నిజమే.. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌లో ఈ అవధాన ప్రక్రియ ఆన్ లైన్‌లోకి అడుగుపెట్టింది. గోగులపాటి కృష్ణమోహన్ దీన్ని నిర్వహిస్తుండగా, హైదరాబాద్, ఆసిఫాబాద్, చెన్నూరు, కాళేశ్వరం, సిద్దిపేట ప్రాంతాలకు చెందిన పలువురు పండితులు ఇందులో పాల్గొంటున్నారు. ఇలా వీరు ఆన్ లైన్ అవధానం చేస్తూ నయా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ‘‘సంస్కృతి దేహమైతే, భాష ఊపిరిలాంటిది, ఊపిరి వెళ్లిపోతే దేహం శవమైపోతుంది’’ అని ఓ కవి అన్నారు. ఉనికి కోల్పోయే స్థితిలో ఉన్న తెలుగు భాషకూ ఆ కవి మాటలు వర్తిస్తాయి. ఎందుకంటే నేడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటూ ఆంగ్లంపై పట్టు సాధిస్తున్న పిల్లలు తల్లి దండ్రులతోనూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు. ఇటువంటి సమయంలో భాషపై పట్టున్న అవధాన పండితులు, టెక్నాలజీలోనూ పట్టు తెచ్చుకుని పిల్లలు, పెద్దలకు అవధాన ఆవశ్యత తెలుపుతున్నారు. పాండిత్యానికి ఆధునిక సాంకేతికత జోడించి అవధానం కార్యక్రమాన్ని డిజిటలైజేషన్ చేస్తున్నారు. తమలోని అత్యంత అరుదైన కళను సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. యూ ట్యూబ్ చానెల్‌లోనూ వీటిని అప్‌లోడ్ చేస్తున్నారు.

అవధానం అంటే..

ఓ మేధావి, సృజనాత్మక ధారణాశక్తి, సమయస్ఫూర్తి, ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసానికి ప్రతిబింబమే అవధానం. క్షిప్రావధానం, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం అని పలు అవధానాలున్నాయి. ఒక పండితుడైన కవిని ఎనిమిది మంది కవులు ఒకేసారి 8 రకాల ప్రశ్నలు అడుగుతారు. వీరిని పృచ్ఛకుడు లేదా ప్రాశ్నికులు అంటారు. అవధాని అందరు ఆడిగిన క్లిష్ట ప్రశ్నలకు చాతుర్యమైన సమాధానాలతో పూరిస్తారు. ఒకే ఆవృత్తంలో పూరిస్తే క్షిప్రవధానమనీ, 4 రౌండ్లలో పూరిస్తే అష్టావధానం అంటారు. పెన్ను, కాగితం లేకుండా పూరించి చివరకు 8 మంది సమాధానాలు ధారణగా చదివి వినిపిస్తారు. ఇదే వందమందితోనైతే శతావధానం, 1,000 మందితో‌నైతే సహస్రావధానం అంటారు. మొబైల్, వాట్సప్‌ల ద్వారా అవధానాలు ఆడియో మాత్రమే చేసేవి ఒకరకం అయితే, వీడియోలతో చేసేవి దృశ్య శ్రవణ మాధ్యమ అవధానాలు మరోరకం. ఆధునిక సాంకేతికత పెరిగిన తర్వాత దృశ్య శ్రవణ ఆన్‌లైన్ అవధానాలు నిర్వహణలో‌కి వచ్చాయి.

అవధాన అంశాలు..

సమస్యా పురాణం.. అవధానం‌లో మొదటి వ్యక్తి ఓ పద్యంలో చివరిపాదం వ్యతిరేక, అయోమయం, అడ్డదిడ్డంగా అర్థం వచ్చే విధంగా ఇస్తారు. దీనిని సమస్యా పురాణం అంటారు. అవధాని భాషా చాతుర్యంతో పదాల విరుపులు, వ్యంగ్యం శ్లేషార్థాలతో అనుకూల, హాస్య, ప్రజామోదయోగ్య సమాధానంతో పూరణ చేస్తారు.

నిషేధాక్షరి లేదా నిషిద్ధాక్షరి…

ఇందులో పృచ్ఛకుడు ఒకే ఛందస్సులో నిర్ణీత ప్రతిపాదిత అంశంపై అవధానిని కోరుతారు. సమాధానం ఒక అక్షరం ఆరంభం కాగానే రాబోయే అక్షరం ఊహించి దానిని నిషేధం చేస్తారు. అవధాని తెలివిగా అదే అర్థం వచ్చే ఇంకో అక్షరంతో దూసుకుపోతాడు. రెండో తరహాలో ముందేకొన్ని అక్షరాలు నిషేధం చేస్తూ కావలసిన భావం. ఛంధస్సు కోరతారు. మూడోవిధానంలో కొన్ని పదాలు మాత్రం నిషేధిస్తాడు. ఉదాహరణకు సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు పాదాలు లేకుండా రామాయణ కథ ఓ పద్యంలో చెప్పమంటాడు.

దత్తపది..

కొన్నిపదాలు ఇచ్చి ఆ పదాలతోనే తన భావానికి తగ్గ పద్యం కోరతారు. ఇలా వర్ణన, ఆశువు, దృశ్యం, అంత్యాక్షరి ప్రస్తావించాలి. వ్యస్తాక్షరి, పురాణ శ్లోక, పద్యానువాదం, ఛందోభాషణం వంటివి ఉంటాయి.

అప్రస్తుత ప్రసంగం..

అవధాని ఏకాగ్రతను భంగం చేస్తూ హాస్యం పుట్టిస్తారు. సామాజికం, ఆధ్యాత్మికం‌తో ప్రశ్నలు
అడగుతారు.

ఛందోభాషణం..

పద్యాల్లోనే ప్రశ్నలు వేయటం. అదే పద్యంలో సమాధానం చెప్పటం.

న్యస్తాక్షరి ..

అడిగిన అక్షరం కోరిన పద్యంలో ఎన్నో అక్షరంగా ఉండాలో నిర్ణయించి చెప్పమనటం

వ్యస్తాక్షరి..

అప్పుడొక, అప్పుడొక అక్షరం, దాని సంఖ్య చెప్పి చివరికి అన్ని కలిపి చెప్పమనటం.

అంత్యాక్షరి..

ఒకపద్యం చదివి చివరి అక్షరంతో మరో పద్యం అడగటం ఇలా ఎనిమిది రకాల అంశాలతో అవధాన కార్యక్రమం నిర్వహిస్తారు.

సాంకేతికతను అందిపుచ్చుకుని..

నేటి అవధాన ప్రక్రియను రేపటి తరానికి అందించేందుకే దృశ్య శ్రవణ అష్టావధానం ఏర్పాటు చేశారు. దీంతో ఆదునిక సాంకేతిక పరిజ్ఞానం సాహిత్యంలో కూడా ఒక భాగమై సామాజిక మాధ్యమాలే కీలకంగా మారాయి. గతంలో వాట్సప్ వేదికగా 108 అవధానాలు పూర్తి చేసిన అనుభవంతో మరో అడుగు ముందుకేసి ఈ దృశ్య శ్రవణ విధానంతో ఈ అష్టావధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంతో దృశ్య శ్రవణ అష్టావధానాలు చేపట్టి వాటిని యూట్యూబ్, బ్లాగుల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ అవధాన కార్యక్రమాల్లో అవధానులు అయాచితం నటేశ్వర శర్మ, గౌరీభట్ల రఘురామశర్మ, గౌరీభట్ల బాలముకుంద శర్మ, మాడుగుల నారాయణ మూర్తి, అవుసుల భానుప్రకాశ్, ఐతగోని వెంకటేశ్వర్లు, బండకాడి అంజయ్య గౌడ్‌తో పాటు ముదిగొండ అమరనాథశర్మ, ముత్యంపేట గౌరి శంకరశర్మ‌లతో జంటావధానం నిర్వహిస్తున్నారు. చుక్కాయపల్లి శ్రీదేవి, ఇతర మహిళా పృచ్ఛకులతో ప్రత్యేకంగా మహిళా అవధానం కూడా నిర్వహిస్తున్నారు.

ముగ్గురు అన్నదమ్ములు..

ఈ దృశ్య‌శ్రవణ అవధానంలో అత్యంత అరుదైన భాగస్వామ్యం చోటు చేసుకుంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి చెందిన మాడుగుల నారాయణమూర్తి చేసిన అవధానంలో ఆయన సోదరులు మాడుగుల భాస్కర శర్మ (సమస్య), మాడుగుల మురళీధర శర్మ (వర్ణన) అంశాలు ఇచ్చి పృచ్ఛకులుగా పాల్గొనడం ఒక విశేషం. ముగ్గురు అన్నదమ్ములు కూడా అవధానంలో పండితులుగా ఎదగడం ఒకటైతే.. తమ్ముడు నారాయణ మూర్తి అవధానిగా ఉంటే అన్నలిద్దరూ పృచ్ఛకులు కావడం మరో విశేషం.

ఆధునిక పోకడ..

దృశ్య శ్రవణ అవధానం మంచి ప్రక్రియ. అభివృద్ధి చెందుతున్న పరిణామానికి ఉదాహరణ. సాంకేతిక పరికరాలను ఉపయోగించుకుని ఎవరి ఇంట్లో వారు ఉండి స్వయంగా పాల్గొనే విధానం, వీక్షించే విధానం చాలా బాగుంది. ఈ నూతన ఒరవడికి గోగుల‌పాటి కృష్ణమోహన్ శ్రీకారం చుట్టారు. ఎందరో అవధానులు, వర్తమాన అవధానులను పృచ్ఛకులుగా, పండితులుగా పరిచయం చేయడం అభినందనీయం.

– ముత్యంపేట గౌరిశంకర శర్మ, ముదిగొండ అమరనాథ శర్మ (జంట అవధానులు), హైదరాబాద్.

12 అవధానాల్లో పాల్గొన్నా..

దృశ్య శ్రవణ అష్టావధానం మొదటి సారిగా ఏప్రిల్ 17‌న గౌరీభట్ల బాలముకుందశర్మ చేశారు. గోగులపాటి కృష్ణమోహన్ అవధానాలను నిర్వహిస్తున్నారు. అందులో ఛందోభాషణం చేశాను. తర్వాత జరిగిన అవధానాల్లో నిషిద్ధాక్షరీ, సమ, దత్తపది, అంత్యాద్యక్షరీ, వర్ణన, మొదలైన అన్ని ప్రక్రియలతో పాటుగా అష్టావధానానికి సంయోజకుడిగాగానూ వ్యవహరించాను. ఇదొక కొత్త అనుభవం, అనుభూతి. ఇంట్లో ఉంటూ సాహిత్యాన్ని పదిమందికి పంచి ఆనందానుభూతిని పొందటం దీని ప్రత్యేకత. ఇప్పటి వరకు 12 అవధానాలో పాల్గొన్నాను.
– మాడుగుల భాస్కర శర్మ

వినూత్నమైన ప్రయోగం..

నాకు గుర్తున్నంతవరకు 2019 జనవరి‌లో గోగులపాటి కృష్ణమోహన్ ఆద్యుడిగా, బాల ముకుంద శర్మ అవధాని అకుంఠిత సంకల్పదీక్షా బలం‌తో 108 రోజులు ఏకబిగిన రోజుకో అవధానం నిర్వహించారు. అందులో దాదాపు 60 మంది పృచ్ఛకులు వివిధ దశల్లో పాల్గొనడం అప్పట్లో సంచలనం. ఈ కరోనా కాలంలో సాంకేతికతను అందిపుచ్చుకుని అవధాన కళను పునరుద్ధరించే ప్రయోగం ఆనందదాయకం. నాలాంటి నూతన కవులకు పాఠాలు నేర్పుతున్న అనుభవం ఇది. ఇంట్లోనే కూర్చుని, ఎందరో ఉద్ధండులైన అష్ట, శతావధాన పండితులను వినే, కనే భాగ్యం కాకుండా, ఎందరో వర్ధమాన అవధానులను సాహితీ ప్రపంచానికి పరిచయం చేసే వేదిక నిచ్చింది సాంకేతికత.
– అష్టకాల విద్యాచరణ్, సిద్దిపేట

రెండింటా ఆరితేరితేనే సాధ్యం..

దృశ్య శ్రవణ అవధానం చేయడం అనేది సాధారణ విషయం కాదు. బయట సభాముఖంగా చేసే అవధానాలకన్నా ఈ విధానం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే సభా వేదికలపై చేసే అవధానానికి మేధ, ప్రజ్ఙ మాత్రం ఉంటే సరిపోతుంది. ఈ ఆన్‌లైన్ ద్వారా అవధానం చేయాలంటే వాటితోపాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎంతో అవసరం. సాంకేతిక పరిజ్ఞానం ఉండగానే సరిపోదు ఇతరుల సహకారం కూడా చాలా అవసరం. ముఖ్యంగా అవధాని, సంయోజకులకు ప్రత్యేకించి ఒక సహాయకుడు తప్పని సరి. మొబైల్‌లో ఇంటర్నల్ స్టోరేజీ ఉండటంతో పాటు ఇంటర్నెట్ స్పీడ్ లేకున్నా ఇబ్బందులే. వీటన్నింటిని అధిగమిస్తూ అంశాలపై దృష్టి సారిస్తూ, పూరణలు చేయడం అనేది అంత సాధారణ విషయం కాదు.ఇలా ఎన్నో ఒడిదుడుకులు అధిగమిస్తూ ఈ ఆన్‌లైన్ అవధానానికి ఓ రూపు తీసుకువస్తున్నాం. ఆన్‌లైన్ దృశ్య శ్రవణ అష్టావధానం చేయడం ఓ ఛాలెంజ్‌గానే
ఉంటుంది. వీటన్నింటిని అధిగమిస్తున్న అవధానవర్యులకు, సంయోజకులకు, పృచ్ఛక కవి
మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఙతలు తెలుపుతున్నా.

– ఆన్‌లైన్ అవధాన నిర్వాహకులు గోగులపాటి కృష్ణమోహన్



Next Story

Most Viewed