లెక్క చెప్పట్లే.. బుక్కులియ్యట్లే.. సీఏ తీరుపై తీవ్ర విమర్శలు

by Kodari Anjali |

సంఘాల లావాదేవీల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన సీఏ సొంతానికి సంఘం డబ్బులు వాడుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లెక్క చెప్పట్లే.. బుక్కులియ్యట్లే.. సీఏ తీరుపై తీవ్ర విమర్శలు
X

దిశ, నల్లబెల్లి: సంఘాల లావాదేవీల్లో పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన సీఏ సొంతానికి సంఘం డబ్బులు వాడుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన కొన్ని నెలలుగా మహిళా సంఘాల బుక్కులు రాయకుండా, సంఘాల లెక్కలు చూపెట్టకుండా సంఘ సమావేశాలకు హాజరుకాకుండా ఉండటం మహిళా సంఘ సభ్యుల అనుమానాలకు కారణమైంది. సీఏను నమ్మినందుకు తీసుకోని లోన్లకు డబ్బులు కట్టాల్సి వస్తోందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022లో రూ .27 లక్షలుగా ఉన్న పొదుపు కాస్త 2025లో రూ.22 లక్షలకు పడిపోవడం పట్ల అనుమానాలు బలపడుతున్నాయి. మరో వైపు అధ్యక్షురాలు సైతం చెక్కులపై సంతకాలు తనవి కాదని స్పష్టం చేయడం అవినీతి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

ఇదీ సంగతి..

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్ల పహాడ్, బజ్జూ తండా పరిధిలో రుద్రమ గ్రామైక్య సంఘం ఉంది. దీని కింద దాదాపు 35 మహిళా సంఘాలు పని చేస్తున్నాయి. ఈ సంఘాల లెక్కలు, లావాదేవీలు సీఏ కొలువుల. సతీష్ చూస్తున్నాడు. ఇదిలా ఉండగా గడచిన కొన్ని నెలలుగా మహిళా సంఘాల లెక్కల్లో తప్పులు జరుగుతున్నట్లు మహిళా సంఘాల సభ్యులు గుర్తించారు. నెలలు గడుస్తున్నా లెక్కలు చూపెట్టకపోవడం, సంఘాల బుక్కులు ఇవ్వకపోవడం అనుమానాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రతీ నెల జరిగే సంఘాల సమావేశాలకు సైతం సతీష్ హాజరుకావడం లేదన్నది సభ్యుల ఆరోపణ. దీంతో సంఘాల లెక్కల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గడిచిన ఆరు నెలలుగా సంఘాలు కిస్తీలు సైతం నిలిపివేసినట్లు సమాచారం. కేవలం పొదుపులు మాత్రమే కొన్ని సంఘాలు కడుతున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ సీఏ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. లెక్కలు చెప్పాలని పలుమార్లు కోరినప్పటికీ లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్షల్లో అవినీతి: గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు కూస లావణ్య

రుద్రమ గ్రామైక్య సంఘంలో అక్రమాలు జరుగుతున్నట్లు సంఘం అధ్యక్షురాలు కూస లావణ్య ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. గడిచిన రెండేళ్లుగా ఒక చెక్కుపై సంతకం చేసినట్లు స్పష్టం చేశారు. తనకు సంబంధం లేకుండా చెక్కులపై సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదుపులు, వడ్డీలు, అప్పుల లావాదేవీల లెక్కల్లో స్పష్టత కొరవడిందన్నారు. సంఘం సభ్యుల పేర్లపై ఎవరి మీద ఎంత అప్పు అనేది తెలియడం లేదన్నారు. లక్షల్లో అవినీతి జరిగిందని, బహిరంగంగా చర్చ జరుగుతున్న స్పందించకపోవడం దారుణం అన్నారు. ఈ నెల 15వ తేదీన లెక్కలు అప్పజెప్తానని లెటర్ రాసిచ్చినట్లు గుర్తు చేశారు. సమావేశం రెండుసార్లు ఏర్పాటు చేసినా రాలేదన్నారు. సీఏ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే లెక్కలు అప్పజెప్పాల్సి ఉన్నప్పటికీ సీఎ దాటవేస్తుండటంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా... సీఏను ప్రశ్నించిన కొందరు సభ్యురాళ్ళతో 20 గుంటల భూమి అప్పజెప్తానని అనడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

ఏపీఎం, తహసిల్దార్, ఎస్సై లకు వినతి పత్రాలు...

రుద్రమ గ్రామైక్య సంఘంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని కోరుతూ 35 గ్రూప్ సభ్యులు సోమవారం నల్లబెల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. ముందుగా మదర్ థెరిస్సా మండల సమాఖ్యకు చేరుకుని అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఎ.పీ.ఏం) సెర్ఫ్ కి వినతిపత్రం అందజేశారు. ఇందులో ప్రధానంగా కొలువుల. సతీష్ అనే వ్యక్తి సీఏ గా పని చేస్తూ 35 సంఘాల్లో రూ.35 లక్షలు అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. నెలలుగా లెక్కలు చెప్పడం లేదని, సమావేశాలకు రావట్లేదన్నారు. గత నెల ఒత్తిడి చేయడంతో ఈ నెల 15 వ తేదీన లెక్కలు, బుక్స్ అప్పజెప్తానని హమీ ఇచ్చినట్లు తెలిపారు. రోజులు గడుస్తున్నా సమావేశాలకు రావడం లేదన్నారు. విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని ఎమ్మార్వోకు, ఎస్సైకు సైతం అందజేశారు.

Next Story