భారత్‌లోకి మరో వ్యాక్సిన్!

by  |
భారత్‌లోకి మరో వ్యాక్సిన్!
X

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి వీలుగా దేశంలోకి మరిన్ని వ్యాక్సిన్లు తీసుకురావాలని పలు ఫార్మా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కరోనాపై పోరులో సమర్థవంతంగా పనిచేసే ఎంఆర్ఎన్ఏ కొవిడ్ వ్యాక్సిన్స్ తీసుకురావాలనే ఆలోచనలో తాము ఉన్నట్టు ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ తెలిపింది. భారత్‌కు ఈ వ్యాక్సిన్‌ను తీసుకు వచ్చేందుకు గాను ఇతర వ్యాక్సిన్ తయారీ దారులతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు లుపిన్ తెలిపింది. అంతేకాకుండా కొవిడ్ చికిత్సలో ఉపయోగించే రెమిడెసివర్ లాంటి డ్రగ్స్‌ను భారత్‌కు తీసుకు వచ్చేందుకు గాను ఇతర కంపెనీలతో టై అప్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించింది. ‘దేశానికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తీసుకు రావాలని మేము అనుకుంటున్నాం.

ఇప్పటికే అరడజనుకు పైగా ప్రముఖ కంపెనీల వ్యాక్సిన్ల ప్రయోగాలు పలు దశల్లో ఉన్నాయి. వాటిలో ఏదో ఓ కంపెనీతో పనిచేయాలని మేము భావిస్తున్నాం. దేశంలోకి మంచి సమర్థవంతమైన వ్యాక్సిన్ తీసుకు రావాలన్నదే మా లక్ష్యం. అందుకోసం ఇప్పటికే చర్చలు ప్రారంభించాము. కానీ రెండు సంస్థల మధ్య ఒప్పందం ఎప్పుడు ఓకే అవుతుందన్న దానిపై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం’ అని లుపిన్ ఎండీ నీలేశ్ గుప్తా వెల్లడించారు. కాగా ప్రపంచంలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి వ్యాక్సిన్ తయారు చేస్తున్న కంపెనీల జాబితాలో ఫైజర్, మోడెర్నాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. దీంతో ఈ రెండు కంపెనీల్లో ఏదో ఒక దానితో లుపిన్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దిగుమతుల ద్వారా ఈ వ్యాక్సిన్లను భారత్‌కు తీసుకు రావాలని లుపిన్ భావిస్తున్నట్టు సమాచారం.



Next Story

Most Viewed