లారీ ఢీకొని అన్న మృతి.. నుజ్జునుజ్జయిన చెల్లెలి కాళ్లు

194
accident-1

దిశ, జడ్చర్ల: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో అన్న మృతిచెందగా, చెల్లెలికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం రాత్రి బాలానగర్ మండలంలో చోటుచేసుకుంది. బాలనగర్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బాలనగర్ మండలం ముత్యాల గ్రామానికి చెందిన సాయి కుమార్ గౌడ్(25), వైష్ణవి(22) అన్నా- చెల్లెలు. షాద్ నగర్ లో ప్రైవేట్ జాబులు చేసే వీరిద్దరూ ఎప్పటిలాగే గురువారం తమ విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై తమ సొంత గ్రామమైన ఉడిత్యాలకు బయలుదేరారు. ఈ క్రమంలోనే బాలనగర్ మండల కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన లారీ వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొని సాయి కుమార్ గౌడ్ పైనుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వైష్ణవి రెండు కాళ్లు విరిగి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బాలనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వైష్ణవిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాయి కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.