తెలంగాణ రియల్టర్ల కీలక నిర్ణయం.. 27న ఏం జరగబోతుంది?

by  |
Telangana Realtors
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది ఆగస్టు నుంచి నిలిపేసిన పంచాయతీ లే అవుట్లలోని ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని డిమాండ్​ చేస్తూ ఈ నెల 27న సచివాలయం ముట్టడికి తెలంగాణ రియల్టర్స్​ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్​కుమార్​ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్​ తార్నాకలోని అసోసియేషన్​ కార్యాలయంలో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాల్లోని గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్​ చేయకుండా ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందన్నారు. దీని వల్ల వెంఛర్లు చేసిన యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే ప్లాట్లు కొనుగోలు చేసిన మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన కొనుగోలుదార్లు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోలేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వివరించారు. అందుకే 27న నిర్వహించ తలపెట్టిన సచివాలయ ముట్టడికి భారీ ఎత్తున వెంఛర్ల యజమానులు, ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు రావాలని కోరారు.

అలాగే కోకాపేట, ఖానామెట్ ​ఈ వేలంలో ఎన్ని సంస్థలు పాల్గొన్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్​చేశారు. వాటి పేర్లు ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారు 60 గజాల ప్లాట్స్ చేసి అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇక్కడ అమ్మిన భూములను 60 గజాల ప్లాట్లు చేసి పేదలకు ఎందుకు కేటాయించలేదన్నారు. సంపద సృష్టించడం చేత కాక ఆస్తులు అమ్ముకోవడం ఘనకీర్తిగా చెప్పుకోవడం మొసగారి తనం కాదా అని ప్రశ్నించారు.

సమావేశంలో సంఘం వర్కింగ్ ​ప్రెసిడెంట్​ నర్సయ్య, ఉపాధ్యక్షుడు బొగ్గు వెంకటేశ్​గౌడ్, మేడ్చల్​మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, హైదరాబాద్​ జిల్లా అధ్యక్షుడు ఎం.సురేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.రమాదేవి, ఎ.సువర్ణకుమారి, జానీ పాషా, కాకునూరి సుధాకర్, వెంకటరమణ, పెద్దిరాజు, ఎస్.సుభాష్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story