ఓటేపిస్తే.. నిర్బంధమా?

by  |
ఓటేపిస్తే.. నిర్బంధమా?
X

ప్రజలను పోలింగ్ కేంద్రాలకు తరలించేలా ప్రోత్సహించడం, ఓటు వేయించడం చట్టాలకు విరుద్ధమా? జమ్ము కశ్మీర్ వేర్పాటువాదులు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఇచ్చిన పిలుపును చిత్తు చేస్తూ.. పెద్ద సంఖ్యలో కశ్మీరీలను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు సంకల్పించడం రాజ్యాంగానికి వ్యతిరేకమా? జమ్ము, కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై ప్రజాభద్రత చట్టం(పీఎస్ఏ)కింద నిర్బంధాన్ని మోపుతూ పేర్కొన్న అభియోగాలు ఈ ప్రశ్నలనే లేవదీస్తున్నాయి.

నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా జమ్ము కశ్మీర్ 2008 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వేర్పాటువాద గ్రూపులు ఆ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలను అభ్యర్థించాయి. ఈ ఎన్నికలతో కశ్మీరీల జీవితాలు మారబోవని ప్రకటించాయి. కానీ, వాటి ‘మాయ’లో పడకుండా ప్రజలను పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో ప్రధానస్రవంతి రాజకీయ నేతలు సఫలమయ్యారు. అందులో ఒమర్ అబ్దుల్లా కీలకంగా ఉన్నారు. దీంతో పోలింగ్ శాతం అంతకుముందు ఎన్నికల కన్నా 2008 ఎన్నికల్లో దాదాపు 20 శాతం పెరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఆ ఎన్నికలు వేర్పాటువాదులకు చెంపపెట్టులాంటివని అప్పుడు ప్రశంసలు కురిశాయి. కానీ, ఆ ఎన్నికలనే సాకుగా చూపి అప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న ఒమర్ అబ్దుల్లాను నేడు పీఏఎస్ కింద నిర్బంధించడం కలకలం రేపుతున్నది.

ఒమర్ అబ్దుల్లాపై పీఎస్ఏ మోపడానికి గల అభియోగాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఒమర్ అబ్దుల్లా తన తిరుగుబాటు భావజాలానికి రాజకీయాలను ఒక ముసుగుగా ఉపయోగిస్తున్నాడని అభియోగపత్రాలు తెలిపాయి. ఈ రాజకీయాలను కేంద్రానికి వ్యతిరేకంగా కుట్ర చేయడానికి వాడుకుంటున్నాడని పేర్కొన్నాయి. ఆర్టికల్ 370ని నీరుగార్చిన తర్వాత ఒమర్ అబ్దుల్లా తనకున్న రాజకీయ పలుకుబడితో ప్రజలను తప్పుదారిలోకి పురికొల్పుతున్నారని తెలిపాయి. ర్యాడికల్ ఆలోచనలను అమల్లో పెడుతున్నాడని, దుష్టరాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించాయి. జమ్ము, కశ్మీర్‌లో ఉగ్రవాదం ఉచ్ఛదశలో ఉన్నప్పుడే చాలామంది కశ్మీరీలను ఓటు వేయించడంలో ఒమర్ అబ్దుల్లా సఫలమయ్యాడని, కశ్మీరీలను అతను ప్రభావితం చేయగలడన్నదానికి ఇదే నిదర్శనమని వివరించాయి.

ఇలాంటి అభియోగాలతోనే జమ్ము, కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పీఎస్ఏ కింద ఒమర్ అబ్దుల్లాపై నిర్బంధం ప్రయోగించింది. 370 అధికరణం నీరుగార్చినప్పటి నుంచి(గతేడాది ఆగస్టు 5వ తేదీ) ఎలాంటి అభియోగాలు పేర్కొనకుండానే నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. తాజాగా, పీఎస్ఏ కింద ఆ నిర్బంధాన్ని కేంద్రం కొనసాగిస్తున్నది. జమ్ము కశ్మీర్‌లో పోలింగ్ శాతాన్ని చూపుతూ ఆ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని కశ్మీరీలు భావిస్తున్నట్టు చెప్పుకొచ్చే కేంద్రం తాజాగా, ఓటింగ్ వేయించడాన్ని కుట్రగా పేర్కొనడాన్ని మేధావులు తప్పుపడుతున్నారు. వాస్తవానికి 370 నీరుగార్చే పరిస్థితులున్నప్పుడూ.. కశ్మీరీలు శాంతియుతంగా ఉండాలని ఒమర్ అబ్దుల్లా నిర్బంధానికి ముందు తన చివరి ట్వీట్ చేయడం గమనార్హం.

ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా పీఎస్ఏ కింద నిర్బంధాన్ని అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై పీఎస్ఏ కింద జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ నిర్బంధం ప్రయోగించింది. బీజేపీ మద్దతుతో జమ్ము, కశ్మీర్ సీఎంగా కొనసాగిన మెహబూబా ముఫ్తీపైనా పలు అభియోగాలు మోపుతూ నిర్బంధాన్ని పొడగించడం గమనార్హం. ఒమర్ అబ్దుల్లాపై నిర్బంధాన్ని సవాల్ చేస్తూ అతని సోదరి సారా అబ్దుల్లా పైలట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


Next Story

Most Viewed