మళ్లీ బ్రేక్.. ఎక్కడిపనులు అక్కడే!

by  |
మళ్లీ బ్రేక్.. ఎక్కడిపనులు అక్కడే!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఎడతెరపి లేని వానతో నగరం తడిసి ముద్దయింది. శిథిల భవనాల రూపంలో ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు నగరంలోని ప్రాంతాల్లో పురాతన భవనాలు కుప్పకూలాయి. పలువురు గాయపడగా, పదుల సంఖ్యలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో శిథిల భవనాలను కూల్చివేస్తామని ప్రగల్బాలు పలికిన జీహెచ్‌ఎంసీ అనంతరం ఆ విషయాన్ని విస్మరించింది. ఏళ్లు గడుస్తున్నా శిథిల భవనాలపై చర్యలంటూ పాత ఫైళ్ల బూజు దులుపడం తప్ప పెద్ద గా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆదివారం ఉద యం 11 గంటలకు హుస్సేనీఆలం ప్రాం తంలో దాదాపు వందేళ్ల పురాతన భనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ భవనంలోని మొదటి అంతస్తులో నివసిస్తున్న ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు.

పురాతన భవనాలతో ముప్పు..

నాలుగు శతాబ్దాల చరిత్ర గల మహానగరంలో వేల సంఖ్య లో పురాతన భవనాలున్నాయి. వర్షాకాలం వస్తే ఎక్కడో ఓ చోట పురాతన భవనాలు కూలడం సాధారణమైపోయింది. గత ఐదేళ్లలో బల్దియా యంత్రాంగం 1500 శిథిల భవనాలను ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించి కూల్చివేసిం ది. 2016లో 485 పురాతన భవనాలను కూల్చివేయగా, 2017లో 294 కట్టడాలను నేలమట్టం చేసింది. 2018లో 402 ఇళ్లను కూల్చివేసింది. 2019లో 176 ఇళ్లను కూల్చివేయగా, 2020 ఆగస్టు నాటికి 120 పాత భవనాలను కూల్చివేసింది. ఇంకా గుర్తించాల్సినవి వేల సంఖలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం పాక్షికంగా దెబ్బతిన్న 89 భవనాల యజమానులు వాటికి మరమ్మతులు చేయించుకున్నారని అధికారులు తెలిపారు. రెండు భవనాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

పాత బస్తీలో మరీ దారుణం..

పాతబస్తీ, శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో మట్టి గోడలతో నిర్మించిన పెంకుటిళ్లలో ఇప్పటికీ కొందరు నివసిస్తున్నారు. గతంలో పాతబస్తీలో పెంకుటిల్లు కూలి ఓ మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కొన్ని ప్రాంతా ల్లో ప్రధాన రహదారుల పక్కన పురాతన భవనాలు ఉన్నాయి. లిబర్టీ చౌరస్తా సమీపంలో ఓ భవనం సగం కూలింది. గతంలో ‘శిథిల భవనం.. ప్రమాదకరం’ అని ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూల్చివేత దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ప్రమాదమని తెలిసినా..

గ్రేటర్‌లో 2013 శిథిల భవనాలను గుర్తించారు. నిబంధనల ప్రకారం నిర్మాణాల స్థితిని బట్టి మరమ్మతులు చేయ డం లేదా కూల్చివేయాలి. 2013 నిర్మాణాల్లో ఇప్పటి వరకు 1500లకు పైగా కూల్చారు. 89 భవనాలకు మరమ్మతులు చేశారు. మిగతా 424 భవనాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వీటిని కూల్చకపోతే ప్రమాదమే అని అంగీకరించే అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. దాదాపు వీటిలో 176 భవనాలపై కోర్టులో కేసులున్నాయి. పాతబస్తీ, సికింద్రాబాద్‌, సెంట్రల్‌ జోన్‌లోని అబిడ్స్‌, కోఠి, అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో పురాతన నిర్మాణాలున్నాయి. మరమ్మ తు చేసుకోకపోతే కూల్చివేస్తామని జీహెచ్‌ఎంసీ నోటీసు లు జారీ చేసినా యజమానులు పట్టించుకోవడం లేదు. కొందరు కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు.

మచ్చుకు కొన్ని ఘటనలు..

– 2008 ఆగస్టులో పాతబస్తీ ఫంజెషాలోని పురాతన ఇల్లు కూలి ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. కోట్ల అలిజాలోని రాయల్‌ ఎంబాసీ స్కూ ల్‌ పక్క పురాతన భవనం గోడ కూలిపోయింది.

– 2009 ఆగస్టులో యూనానీ ఆస్పత్రి ప్రధాన గోపు రం, మీనార్లు కుప్పకూలాయి. దక్షిణ మండలం డీసీపీ కార్యాలయం ప్రహరీ కూలింది. చార్‌కమాన్‌, కో మటివాడి ప్రాంతాల్లో పాతభవనాలు నేలకొరిగాయి.

– 2010లో దారుల్‌షిఫాలో వర్షానికి పాతభవనం కుప్పకూలి ఓ మహిళా తీవ్ర గాయాలపాలైంది. డబీర్‌పురాలో ఇద్దరికి ప్రమాదం తప్పింది. పూల్‌ బాగ్‌ అహ్మద్‌కాలనీలో ఓ ఇల్లు కూలి ముగ్గురు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు.

– 2017 జూలైలో ఫీల్‌ఖానా బేగంబజార్‌లో కొను గోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులపై సజ్జ కూలడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.

– 2018లో బండ్లగూడ ఖుబాకాలనీలో రెండు ఇండ్లు కూలడంతో ఇద్దరు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. రియాసత్‌నగర్‌ మరో రెండు పురాతన ఇండ్లు కూలి పోయాయి.

– తాజాగా హుస్సేనీ ఆలయం దుర్ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందారు.

ఓల్డ్ మలక్ పేట్లో కూలిన పురాతన ఇల్లు..

రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మలక్ పేట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మలక్ పేట్ డివిజన్ శంకర్ నగర్‌లో పురాతన ఇల్లు కుప్పకూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లోని సామగ్రి ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మహమ్మద్ సైఫ్ ఉద్దీన్ షఫీ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్ట పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఏసీపీ టౌన్ ప్లానింగ్ అధికారులు నష్టాన్ని అంచనా వేశారు.


Next Story