రెవెన్యూ అధికారుల తప్పిదం.. నాకు శాపంగా మారింది

by  |
women-farmer
X

దిశ, షాద్ నగర్: రెవెన్యూ అధికారుల తప్పిదం ఆ మహిళా రైతుకు శాపంగా మారింది. ఆమెకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని రికార్డుల్లో తప్పుగా నమోదు చేసి, ఆమెను చిక్కుల్లో నెట్టారు. దీంతో చేసేదేం లేక తన సమస్య పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతోంది. వివరాళ్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని నిర్దవెళ్లి గ్రామానికి చెందిన చెదురువెళ్ళి మణెమ్మ(భర్త పేరు శ్రీరాములు గౌడ్) పేరుమీద నిర్దవెళ్లి గ్రామ శివారులో 282-అ సర్వే నెంబర్‌లో ఆమెకు 24 గుంటల భూమి ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ పేరుతో అధికారులు ఆగమాగం చేసి, కేవలం5 గుంటలు మాత్రమే నమోదు చేశారు. ఈ సర్వే నెంబర్‌లో మిగతా 19 గుంటల భూమిని తొలగించారు. 2008 నుండి 2018 వరకు 24 గుంటల భూమిగా రికార్డుల్లో ఉన్నది, 2019లో ఆన్‌లౌన్ రిజిస్ట్రేషన్ల పేరుతో ఏకంగా 19 గుంటల భూమిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిని సరిచేయించడానికి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

విచిత్రమేమంటే 282-అ సర్వేనెంబర్‌లో ఒక రైతు తనకున్న 37 గుంటల భూమిని మొత్తం అమ్ముకున్నా.. మళ్లీ ఆన్‌లైన్‌లో తనకు 37 గుంటల భూమి ఉందని అధికారులు నమోదు చేయడం ఆందోళనకు దారితీస్తోంది. కేశంపేట తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. అధికారులు సమస్య పరిష్కరించకపోగా.. కలెక్టర్‌ను సంప్రదించాలంటూ తప్పించుకుంటున్నారని మండిపడింది. తెలిసిన స్థానిక తహసీల్దార్ ఆఫీస్‌లోనే ఎవరూ పట్టించుకోవడంలేదు. ఇక కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి ఏం చేయాలి అని ఆమె అధికారులను ప్రశ్నిస్తోంది. అందుకే కనీసం తన సమస్య మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్తే అయినా.. పరిష్కారం లభిస్తుందని ఆశిస్తోంది. అందుకే సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు తన సమస్య వివరించింది.


Next Story

Most Viewed