అధికారుల్లో టెన్షన్ టెన్షన్.. రాత్రికి రాత్రే సీఎంకు చేరిన ఫైల్

by  |
అధికారుల్లో టెన్షన్ టెన్షన్.. రాత్రికి రాత్రే సీఎంకు చేరిన ఫైల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉన్నతాధికారుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఏడాదిగా పెండింగ్​ పెట్టిన ఫైళ్లను ఒక్కరోజులోనే క్లియర్​ చేసేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల జోన్ల వారీ సర్దుబాటు ప్రక్రియ ఎక్కడికక్కడే ఆగిపోయింది. దీనిపైనా హడావుడిగా సర్వీసు రికార్డులను అనుసరిస్తూ నిర్ణయం తీసుకుంటారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ సర్వీసు బుక్​ రికార్డుల ప్రకారం ఉద్యోగులను జోనల్​ వారీగా సర్దుబాటు చేస్తే.. ఆ తర్వాత ఎలాంటి ఆఫ్షన్లకైనా అవకాశం ఉంటుందా? అనే సందిగ్ధంలో ఉద్యోగవర్గాలున్నాయి. రూల్​ ఆఫ్​ రిజర్వేషన్ల కారణంగా సచివాలయంలో ఆగిపోయిన పదోన్నతుల ఫైల్ ఎట్టకేలకు ముందుకు కదులుతున్నది. ఆర్​ఓఆర్​ ప్రకారం పదోన్నతులు పొందిన 26 మందికి నోటీసులు జారీ చేయగా, 17 మంది అధికారులు తిరుగు సమాధానమిచ్చారు. ఈ సమాధానానికి సంతృప్తి చెందని ఉన్నతాధికారులు, వారి పదోన్నతుల అంశాన్ని కిందకు దింపి, ఆ స్థానాల్లో బీసీ, ఓసీ వర్గాలకు చెందిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తున్నారు. అయితే దీనిపైనా చాలా రోజులు పెండింగ్​ పెట్టి.. ఫ్యానెల్​ ఇయర్​ ఆఖరి రోజున హడావుడి చేస్తున్నారు. ఆగస్టు 31న ప్యానెల్​ ఇయర్​ ముగింపు సందర్భంగా ఆ శాఖల్లో ప్రమోషన్లను ఫైనల్​ చేయకుంటే వారంతా ఒక ఏడాది నష్టపోయే చాన్స్ ఉంది. సచివాలయంలో దాదాపు 130 మందికి పదోన్నతులను కల్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను సీఎం కేసీఆర్‌కు పంపించారు.

జోనల్​ సర్దుబాటుపై నిర్ణయమేంది?

రాష్ట్రంలో కొత్త జోనల్​ వారీగా ఉద్యోగుల సర్దుబాటు ఎటూ తెగడం లేదు. ఆగస్టు 9 నుంచే ఉద్యోగులకు ఆఫ్షన్లు ఇస్తామని, 20లోగా ప్రక్రియను పూర్తి చేస్తామంటూ సీఎస్​ ప్రకటించారు. దీనిపై అప్పటి నుంచి దాటవేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఈ నెలాఖరులోగా జోనల్​ సర్దుబాటు చేయాలనే నిబంధనలున్నాయి. కానీ ఇంత వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోలేదు. పాత జిల్లాల ప్రకారం ఉద్యోగాల్లో చేరిన వాళ్లలో చాలా మంది అధికారులు డిప్యూటేషన్లపై ప్రస్తుతం ఇతర జోన్లలో పని చేస్తున్నారు. వీరంతా ఇప్పుడు స్థానికత ప్రకారం ఎక్కడకు వెళ్లాలనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉండగా, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నెలాఖరులోగా జోనల్​ వారీగా సర్దుబాటు చేయకుంటే రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రకారం మళ్లీ అనుమతి తీసుకోవాలని కొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. సవరణ ఉత్తర్వులను అనుసరించి కొనసాగించే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు జోనల్​ వారీగా విభజన భయం పట్టుకుంది. ఒకవేళ ఆయా విభాగాల హెచ్​ఓడీల నుంచి సర్వీసు బుక్​ రికార్డుల ప్రకారం ఉద్యోగుల నుంచి ఆఫ్షన్లు తీసుకోకుండా జోనల్​ కేటాయింపులు చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రానున్నట్లు స్పష్టమవుతోంది.

రాత్రి వేళ కసరత్తు

మరోవైపు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులతో పాటు పలు శాఖల్లో కూడా సోమవారం రాత్రి కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి చాలా విభాగాల్లో పదోన్నతులను జనవరి, ఫిబ్రవరి నుంచే క్లియర్​ చేశారు. దాదాపు రెండేండ్లుగా ఈ ఫైల్​ పెండింగ్‌లో ఉంది. దీంతో సీఎం కేసీఆర్‌కు ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేసిన దరిమిలా దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల్లో పదోన్నతులు కల్పించారు. కొన్ని శాఖల్లో కొంతమందికి ప్రమోషన్లతో పోస్టింగ్‌లు ఇవ్వగా, మరికొంతమందిని పాత స్థానాల్లోనే పదోన్నతులతో కొనసాగిస్తున్నారు. రూల్​ ఆఫ్​ రిజర్వేషన్​పై వివాదం కోర్టులకెక్కడంతో సచివాలయంలో ప్రమోషన్లు ఆగిపోయాయి. దీనిపై సుప్రీం కోర్టు గైడ్​లైన్స్​ ఇవ్వడంతో హడావుడిగా ప్రమోషన్ల లిస్ట్ రెడీ చేశారు. ఆలస్యం కావడంతో ఇటీవల పలువురు ఉద్యోగులు సీఎస్​ చాంబర్​ ఎదుట బైఠాయించిన విషయం తెలిసిందే. ఆర్​ఓఆర్​(రూల్స్ఆఫ్​ రిజర్వేషన్​) కింద ప్రమోషన్లు పొందిన 26 మందికి సీఎస్​ నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్టు నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై 17 మంది తిరుగు సమాధానం ఇవ్వగా సీఎస్​ సంతృప్తి చెందలేదు. దీంతో వీరికి రివర్షన్​ ఆర్డర్లు ఇచ్చారు. ఆర్​ఓఆర్​ సవరణ తర్వాత సెక్రటేరియట్‌లో దాదాపు 130 మందికి పదోన్నతులు రానున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైలును సోమవారం రాత్రి ఆగమేఘాల మీదకేసీఆర్​ ఆమోదానికి పంపారు.


Next Story

Most Viewed