సారీ.. ఆర్టీసీ జీతాలు పెంచలేం!

by  |
సారీ.. ఆర్టీసీ జీతాలు పెంచలేం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా లాక్‌డౌన్‌లో ఆర్థికంగా నష్టపోయిన ఆర్టీసీ ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలతో మరింత కుదేలైందని, ఈ పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలు పెంచడం సాధ్యం కాదని ఆ సంస్థ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడమో లేక బస్సు టికెట్ చార్జీలను పెంచడమో చేస్తే తప్ప సంస్థ ఆర్థికంగా కోలుకునే పరిస్థితుల్లో లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించిన నివేదికలో ఆర్టీసీ అధికారులు నొక్కిచెప్పారు. అసలే ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి లాక్‌డౌన్, డీజిల్ ధరల పెంపు మరింత అగాధంలోకి నెట్టేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా పీఆర్సీ, ఫిట్‌మెంట్ లాంటివాటితో జీతాలు పెరుగుతాయని భావిస్తున్న తరుణంలో ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం జీతాలు పెంచడం సాధ్యం కాదన్న వార్తలు పిడుగులా మారాయి.

“గతంలో బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర రూ.67 ఉండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ఈ ధర లీటర్‌కు రూ.15 పెరిగింది. ఇది ఆర్టీసీపై ఆర్థిక భారం మోపింది. లాక్‌డౌన్ సమయంలోనూ ఆర్టీసీ నష్టాలనే చవిచూసింది. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల భారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచితే అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలి.. లేదంటే బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదు” అని అధికారులు సీఎంకు వివరించారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఆర్టీసీపై జరిపిన సమీక్ష సందర్భంగా అధికారులు నివేదిక సమర్పించి పై అంశాలను వివరించారు. వాస్తవానికి గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి చాలా మెరుగుపడిందని, ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.

కార్గో సేవలపై కేసీఆర్ ప్రశంసలు

ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో సర్వీసుల విధానం విజయవంతమైందని, ప్రజలకు మంచి సేవలు అందుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సంస్థ అధికారులను అభినందించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్శిళ్లను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేరవేసిందని, దీనివల్ల రూ.22.61 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఆర్టీసీ కార్గో సేవల పట్ల సంతృప్తిగా ఉన్నారని అభినందించారు. ఆర్టీసీ కార్గో సేవల స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్‌ను ప్రశంసించారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్సిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుతాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా‌రావు, ఆర్థిక సలహాదారు రమేశ్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదగిరి దితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed