టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆఫ‌ర్లు, హామీలు అందుకేన‌ట‌!

by  |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆఫ‌ర్లు, హామీలు అందుకేన‌ట‌!
X

దిశ, ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గులాబీ ఎమ్మెల్యేలు నిర్మాణాత్మక స్వార్థపూరిత విధానాన్ని అవ‌లంభిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. అంచ‌నాలు, ఊహ‌లు తొల‌గిపోయి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం వైపు ప్రజ‌లు చూస్తున్నార‌నే సంకేతాలు వెలువ‌డ్డాయి. బీజేపీ బ‌లంగా పుంజుకుంటోంద‌న్న భావ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌లంగా నాటుకుంది. ఈ ర‌స‌వ‌త్తర రాజ‌కీయ స‌మ‌యంలో వ‌చ్చిన ప‌ట్టభ‌ద్రుల ఎన్నిక‌ల‌కు గ‌తంలో ఎన్నడూ లేనంత‌గా ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే ఈ ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల పార్టీ ముఖ్య నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. సామాన్య ప్రజానీకం ఓట్లేసే శాస‌న స‌భ‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల తీర్పే అలా ఉంటే రాజ‌కీయ చైత‌న్యం క‌లిగిఉండే విద్యావంతులు ఇచ్చే తీర్పు ఎలా ఉండ‌బోతోంద‌న్నది స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది.

టీఆర్ఎస్‌కు ప్రతిష్ఠాత్మకం… ఎమ్మెల్యేల‌కు సంక‌టం..

ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను టీఆర్ఎస్ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్సే ప్రబ‌ల శ‌క్తిని క‌లిగి ఉండాల‌ని చాట‌లంటే ఈ ఎన్నిక‌ల‌నే వేదిక‌గా చేసుకోవాల్సిన ఆవ‌శ్యకత‌ను ఎమ్మెల్యేల‌కు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వివ‌రించిన‌ట్లుగా స‌మాచారం. అందుకే మీ నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాల్లో బేష‌జాలు ప‌క్కన‌పెట్టి అంతా స‌మ‌న్వయంతో ముందుకు సాగాలంటూ సందేశ‌మిచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అందుకే గతంలో విబేధాల‌తో పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఇన్వాల్వ్ కానీ నేత‌లు సైతం ఒకే వేదిక‌పై ద‌ర్శన‌మిస్తుండ‌టం ఇందుకు నిద‌ర్శనం. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ఇదే ప్రస్పుట‌మ‌వుతోంది.

టీఆర్ఎస్ పార్టీ అధినేత నుంచే నేరుగా ఆదేశాలు రావ‌డంతో ఎమ్మెల్యేలు కూడా అల‌ర్టయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోతే.. మిగ‌తా పార్టీలు ప్రత్యామ్నాయం అనే ఆలోచ‌న ప్రజ‌ల్లో వస్తుందనే భయం ఎమ్మెల్యేల‌కు ప‌ట్టుకుంది. అందుకే త‌మ కాళ్ల కింది భూమి క‌ద‌ల‌కుండా ఉండాలంటే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనే ప్రజ‌ల్లో అసంతృప్తి లేద‌ని.. అంతా స‌వ్యంగానే ఉంద‌న్న విష‌యాన్ని చాటి చెప్పాల‌ని భావిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పోల‌య్యే ఓట్లు కూడా ఎమ్మెల్యేల ప‌నితీరుకు నిద‌ర్శనంగా అధిష్ఠానం భావించే అవ‌కాశం ఉండ‌టంతో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఎమ్మెల్యేలు స్వయంగా ప్రచారం సాగిస్తున్నారు. అభ్యర్థితో ప‌నిలేకుండానే ఎన్నిక‌ల ర‌ణంలో పాల్గొంటున్నారు. సొంతంగా పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేసేందుకు కూడా వెన‌కాడ‌క‌పోవ‌డం విశేషం.

పెద్ద ఎత్తున ఆఫ‌ర్లు… హామీలు..

ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను సాధార‌ణంగా అయితే విద్యావంతుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికే ప‌రిమిత‌మ‌వుతుంటారు. కానీ ఈ ఎన్నిక‌ల ప్రచారం అందుకు భిన్నంగా సాగుతున్నాయి. ఓవైపు ప‌ట్టభ‌ద్రుల‌ను ఆక‌ర్షిస్తూనే… ప‌ట్టభ‌ద్రుల‌ను కూడా ప్రభావితం చేసే సామాజిక కోణాల‌ను ప‌ట్టుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. కుల‌, మ‌త సంఘాల‌తో భేటీ అవుతుండ‌టం ఇందుకు నిద‌ర్శనం. యూత్‌ను ఆక‌ట్టుకునేందుకు క్రికెట్ పోటీల‌ను నిర్వహించ‌డం ఇందులో భాగ‌మే. ఆయా సామాజిక వ‌ర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న ప‌నుల‌ను నొక్కి వ‌క్కాణిస్తున్నారు. పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు ఎమ్మెల్యేలు త‌మ‌ప‌రిధిలోని పనుల‌పైనా పెద్ద ఎత్తున హామీల‌ను గుప్పిస్తున్నారు. కొన్ని కుల‌ సంఘాల‌కు, నాయ‌కులకు ఆఫ‌ర్లు, ప్యాకేజీలు కూడా ప్రక‌టిస్తున్నట్లుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed