అమెరికా వద్దు.. కెనడాయే ముద్దు!

by  |
అమెరికా వద్దు.. కెనడాయే ముద్దు!
X

ఇండియా నుంచి కెనడాకు చదువు కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కెనడా ప్రభుత్వం కూడా భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. గత రెండేళ్ల నుంచి భారతీయ విద్యార్థులకు జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్య లక్ష దాటాయి. స్టడీ పర్మిట్ల ద్వారా అంతకుముందు ఏడాదిలో 1.07 లక్షల మంది భారతీయ విద్యార్థులు అనుమతి పొందగా, 2019లో ఆ సంఖ్య 1.39 లక్షలకు పెరిగింది. రెండేళ్ల కాలానికి పరిశీలిస్తే ఈ సంఖ్య 68.3 శాతం పెరిగింది. 2017లో కెనడా ప్రభుత్వం ద్వారా 82,990 స్టడీ పర్మిట్లు భారతీయ విద్యార్థులకు మంజూరయ్యాయి.

2019లో కెనడా ప్రభుత్వం మొత్తం 4 లక్షలకుపైగా స్టడీ పర్మిట్లను ఆమోదించింది. అందులో 34.5 శాతంతో 1.39 లక్షల పర్మిట్లు భారతీయ విద్యార్థులకు చెందినవే. 2018లో మొత్తం 3.55 లక్షల పర్మిట్లు ఆమోదం పొందాయి. అంటే, ఏడాది కాలంలో 13.8 శాతం స్టడీ పర్మిట్లు పెరిగాయి. మిగిలిన దేశాల కంటే భారతీయ విద్యార్థులే ఎక్కువగా స్టడీ పర్మిట్లను పొందారు. మొత్తం పర్మిట్లలో ఇండియా తర్వాత చైనా విద్యార్థులు 21 శాతం మంది ఉన్నారు. కెనడా స్టడీ వీసాలను పొందే చైనా విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లుగా క్షీణిస్తోంది. ఇండియా నుంచి కెనడాకు విద్యార్థులు పెరుగుతున్నారు. 2018లో 85,165 మంది చైనా విద్యార్థులకు కెనడా ప్రభుత్వం స్టడీ పర్మిట్లు ఇవ్వగా, 2019లో అది 84,710 కు తగ్గింది.

గతం కంటే గడిచిన మూడేళ్ల కాలంలో కెనడాకు భారతీయ విద్యార్థులు క్యూ కట్టడానికి ప్రధానంగా అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్(ఓపీటీ) విషయంలో అనిశ్చితులు ఏర్పడటం, అమెరికాలో చదువు పూర్తయ్యాక హెచ్-1బీ వీసాల సమస్య ఉత్పన్నమవడం. ఈ కారణాలతో భారతీయ విద్యార్థులు అమెరికా ప్రత్యామ్నాయంగా కెనడాను ఎంపిక చేసుకుంటున్నారు. కెనడా దేశ అనుమతులు విద్యార్థులకు పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకు అవసమైన నిధులను సమకూర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పైగా కెనడా ప్రభుత్వం గరిష్టంగా మూడేళ్ల వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్‌ని ఇస్తుండటం ఇక్కడి విద్యార్థులకు ఆశలు కల్పించే అంశం. అంతేకాకుండా చదువుతోపాటు పనిచేయడం ద్వారా అనుభవాన్ని బట్టి కెనడాలో శాశ్వత నివాసం ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ మార్గానికి అవసరమైన పాయింట్లు పెరుగుతాయి.

కెనడా ప్రభుత్వం ఇచ్చే స్టడీ పర్మిట్ అనేది వీసా కాదు. అంతర్జాతీయ విద్యార్థులు కెనడాలోని పేరుగల విద్యాసంస్థల్లో చదువుకోవడానికి అవసరమైన అనుమతి పత్రం. దీని కాలవ్యవధి చదువు పూర్తయిన తర్వాత 90 రోజుల వరకూ కెనడాలో ఉండడానికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఆ దేశం నుంచి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. లేదా పొడిగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


Next Story

Most Viewed