- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేం శత్రువులం కాదు.. రాజకీయ ప్రత్యర్థులమే : శరద్ పవార్‌తో భేటీపై షిండే కామెంట్
శరద్ పవార్, తాను రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థులం అని, వ్యక్తిగతంగా శత్రువులం కాదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేల సమావేశం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్న తరుణంలో షిండే అసెంబ్లీ వేదికగా శుక్రవారం స్పందించారు. తాము రాజకీయ ప్రత్యర్థులం మాత్రమేనని, శత్రువులం కాదని తేల్చి చెప్పారు. తమ మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నంత మాత్రాన వ్యక్తిగత శత్రుత్వం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. శరద్ పవార్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే, ఆయనకు శాలువా కప్పి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికానని షిండే సభకు తెలిపారు. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు శరద్ పవార్ అసెంబ్లీకి వచ్చి, 15 నిమిషాలు షిండేతో విడిగా చర్చలు జరపడం మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. దీనిపై శివసేన (యూబీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్సీపీపై తీవ్ర విమర్శలు చేసింది. అయితే శరద్ పవార్ వర్గం దీనిని తిప్పికొట్టింది.
ఇది టీ కప్పులో తుఫాను లాంటిదే : సుప్రియా సూలే
ఈ పరిణామాన్ని శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే కేవలం ఒక చిన్న టీ కప్పులో తుఫానుగా అభివర్ణించారు. ఇది కేవలం ఒక సాధారణ మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆమె కొట్టిపారేశారు. సంజయ్ రౌత్‌తో మాట్లాడి అనుమానాలను తొలగించామని, తమ పార్టీలోని 8 మంది ఎంపీలు ఐక్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. అయితే కూటమిలోని మరో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ దీనిని పక్కా ముందస్తు ప్లాన్‌తో జరిగిన భేటీగా అనుమానిస్తోంది.






