వాంగ్‌చుక్‌ ప్రాణాలు కాపాడాలి.. బలవంతంగానైనా ఆహారం తినిపించాలి : ఢిల్లీ హైకోర్టులో పిల్

by I. Sairam |

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్న ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ కు బలవంతంగానైనా ఆహారం తినిపించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.

వాంగ్‌చుక్‌ ప్రాణాలు కాపాడాలి.. బలవంతంగానైనా ఆహారం తినిపించాలి : ఢిల్లీ హైకోర్టులో పిల్
X

దిశ, నేషనల్ బ్యూరో : నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు అత్యవసరంగా వైద్య సహాయం అందించాలని కోరుతూ బుధవారం ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆయన నిరాహార దీక్షను ముగించేందుకు బలవంతంగా ఆహారం తినిపించేలా ఆదేశాలు ఇవ్వాలని సామాజిక కార్యకర్త, న్యాయవాది రాకేశ్ కుమార్ సైని పిటిషన్‌లో కోరారు. సోనమ్ వాంగ్‌చుక్‌ను తక్షణమే ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆయన ప్రాణాలను కాపాడటానికి బలవంతంగానైనా లిక్విడ్ డైట్ అందించేలా కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని, ఆయన ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారని, ఆయన దీక్షను ఇలాగే కొనసాగిస్తే, మరో 2 రోజుల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకవేళ ఆయనకు ఏదైనా జరిగితే, అది దేశానికి, ప్రపంచానికి ఎంతో అవమానకరమైన విషయంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వాంగ్‌చుక్‌ను ఒక కరడుగట్టిన నేరస్తుడిలా, ఉగ్రవాదిలా, దేశద్రోహిలా చూస్తోందని, ఆయన ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని పిటిషనర్ ఆరోపించారు. పిటిషన్ తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోంది : అభిజీత్ దీప్కే

సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై అభిజీత్ దీప్కే ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తిపై ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం మౌనం దారుణమని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు కాక్‌రోచ్ జనతా పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని, వారంతా ఎందుకు నిరాహార దీక్ష చేయడం లేదు అనే అనవసర ప్రశ్నలను పక్కనపెట్టి, అసలైన ప్రశ్నలను అడగాలని పిలుపునిచ్చారు. ప్రధాని ఎందుకు చర్చలు జరపడం లేదు ? విద్యాశాఖ మంత్రిని ఎందుకు జవాబుదారీని చేయడం లేదనే ప్రశ్నలకే సమాధానాలు కావాలని అన్నారు. అధికారంలో ఉన్నవారిని కాపాడటానికి చేసే ప్రయత్నాలను ప్రశ్నించాలని కోరారు.

నేడు దేశ వ్యాప్త సామూహిక నిరసన : సీజేపీ

దేశవ్యాప్తంగా గురువారం ఒక రోజు సామూహిక నిరాహార దీక్షకు చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆయనకు, పరీక్షల లీకేజీలపై పోరాడుతున్న విద్యార్థులకు సంఘీభావంగా ఈ సామూహిక దీక్షను చేపట్టాలని కోరింది. ఈ నిరసనలో భాగంగా వాంగ్‌చుక్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ పిక్చర్లను ‘సపోర్ట్ సోనమ్’గా మార్చుకోవాలని సూచించింది.

సీజేపీ నిరసనకు కాంగ్రెస్ ఎంపీ మద్దతు

సీజేపీ చేపట్టిన నిరసనకు మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రశాంత్ పడోలె బుధవారం మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన జంతర్ మంతర్ వద్దకు వెళ్లి సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిశారు. జూలై 20న నిర్వహించ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌లో తాను కూడా పాల్గొంటానని పడోలె హామీ ఇచ్చారు. ప్రభుత్వ అవినీతి కారణంగానే దేశంలోని యువత కలలు నెరవేరడం లేదని ఆయన ఆరోపించారు. కాగా.. సీజేపీ చేపట్టిన నిరసనలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఇదిలా ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ న్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, రైతు నాయకుడు రాకేశ్ తికాయత్‌లు గురువారం సాయంత్రం సోనమ్ వాంగ్‌చుక్ ‌ను కలవనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి జీనత్ అమన్ కూడా సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి తన సంఘీభావాన్ని ప్రకటించారు.

Next Story