40 నిమిషాలు ఆర్తనాదాలు.. పోలీసు స్టేషన్ ముందే రక్తస్రావంతో యువకుడి మృతి

by I. Sairam |

40 నిమిషాల పాటు ఓ యువకుడు తీవ్ర రక్తస్రావంతో పోలీస్ స్టేషన్ ముందే పడిపోయి ఉన్నా.. పోలీసులు స్పందించలేదు. దీంతో ఆ యువకుడు మరణించాడు.

40 నిమిషాలు ఆర్తనాదాలు.. పోలీసు స్టేషన్ ముందే రక్తస్రావంతో యువకుడి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో : పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు తీవ్ర రక్తస్రావంతో మరణించాడు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని గజియాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌కు చెందిన రాజ్ కుమార్ గజియాబాద్‌లో కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఆదివారం రాత్రి ఓ ఆటోలో ప్రయాణించి మధుబన్ బాపుధామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ సెక్టార్-23 లో ఉన్న పింక్ పోలీస్ బూత్ వద్ద ఆటో దిగాడు. తర్వాత రూ. 20 విషయంలో అతడికి, ఆటో డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెద్దది కావడంతో రక్షణ కోసం సంజయ్ నగర్ సెక్టార్-23 లోని మహిళా పోలీస్ పింక్ బూత్ వైపు రాజ్ కుమార్ పరుగెత్తాడు. ఆ సమయంలో రాజ్ కుమార్, ఆటో డ్రైవర్ ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. వారి గొడవను చూసి భయపడిన లోపలి మహిళా పోలీసులు తలుపులు లాక్ చేసుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న రాజ్ కుమార్ స్టేషన్ తలుపును బలంగా బాదడంతో గ్లాస్ పగిలిపోయింది. ఆ గాజు ముక్కలు అతడి చేతి నరాల్లోకి బలంగా దిగబడ్డాయి. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. సుమారు 40 నిమిషాల పాటు అతడు రోడ్డుపై రక్తం ఓడుతూ సహాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. అయినా అటు పోలీసులు గానీ, స్థానికులు గానీ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడం వల్ల చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు.

పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు..

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూపీ పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో గజియాబాద్ డీసీపీ ధవళ్ జైస్వాల్ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు సిట్ ను ఏర్పాటు‌చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై రాజ్ కుమార్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్నా ఎవరూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.

Next Story