మైలేజీని వాహనదారులు లెక్కించలేరు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

by I. Sairam |

సాధారణ వాహనదారుడు తన వాహనం మైలేజీని కచ్చితత్వంతో కొలవలేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

మైలేజీని వాహనదారులు లెక్కించలేరు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్ విధానంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న తరుణంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాహనదారులు తమ వాహనాల మైలేజీని స్వయంగా ఖచ్చితంగా కొలవలేరని, కేవలం వాహన తయారీదారుల అధీకృత డీలర్ల వద్ద ఉండే టెస్టింగ్ మెషిన్ల ద్వారానే దీనిని తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2023లో కొనుగోలు చేసిన తన కారు ఈ20 పెట్రోల్‌ వాడుతున్నందుకు మైలేజీ గణనీయంగా పడిపోయిందని, సిటీలో గతంలో 11 కిలోమీటర్ల వచ్చేదని, ఇప్పుడు 7 కిలోమీటర్లే వస్తోందని ఓ మహిళా జర్నలిస్ట్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఆ మైలేజీని ఎలా లెక్కించారని గడ్కరీ ప్రశ్నించగా, కారు డాష్ బోర్డుపై చూపించే మైలేజీ రీడింగ్ ఆధారంగా తాను తెలుసుకున్నానని ఆమె సమాధానం ఇచ్చారు. మళ్లీ గడ్కరీ మాట్లాడుతూ.. మనం మైలేజీని సరిగ్గా తనిఖీ చేయలేమని, కంపెనీ అధీకృత డీలర్ వద్ద ఉండే టెస్టింగ్ మిషిన్ ద్వారానే ఇది సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ20 పెట్రోల్ వాడటం వల్ల ఇంజిన్‌లు దెబ్బతింటాయనే వాదనల్లో శాస్త్రీయ ఆధారాలు లేవని పునరుద్ఘటించారు. ఒకవేళ ఎవరికైనా సమస్య వస్తే డీలర్ వద్ద చెక్ చేయించి తన దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు.

బంకుల్లో స్వచ్ఛమైన పెట్రోల్ కూడా ఉంచాలి : కేజ్రీవాల్

ఈ20 పెట్రోల్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనలపై చర్చించడానికి, ప్రజల ఇబ్బందులను వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు ప్రధానికి మంగళవారం లేఖ రాశారు. ఈ సమావేశంలో ఈ20 పెట్రోల్‌పై వస్తున్న సాంకేతిక సమస్యలు, ప్రజల నుంచి తనకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను వివరించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు స్వచ్ఛమైన పెట్రోల్, ఈ20 పెట్రోల్ రెంటినీ అందుబాటులో ఉంచాలని కోరారు. వినియోగదారులకు నచ్చిన దానిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఇథనాల్ బ్లెండెండ్ పెట్రోల్ ధరలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ20 పెట్రోల్‌తో ప్రజలకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకోవడానికి పార్టీ తరఫున ఒక ఆన్‌లైన్ పిటిషన్‌ను ప్రారంభించామని తెలిపారు. మైలేజీ, ఇతర సమస్యలపై ప్రజలు అభిప్రాయాలను షేర్ చేయాలని కోరారు.

Next Story