- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌కు భారత్ నిరసన : హోర్ముజ్‌లో భారతీయ నావికుడి మృతిపై ఆగ్రహం
హోర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడి చేయడం వల్ల భారతీయ నావికుడు మరణించాడు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో : హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు షిప్పింగ్ ట్యాంకర్లపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయ నావికుడు మరణించగా, మరో ఆరుగురు భారతీయులతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మొహమ్మద్ జవాద్ హొస్సేనీని పిలిపించి తీవ్ర నిరసనను తెలియజేసింది. భారతీయ నావికుడి మృతి చెందిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒమన్ సమీపంలోని కీలకమైన అంతర్జాతీయ జలమార్గంలో ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన ఈ దాడులను విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
అంతర్జాతీయ జలమార్గాల్లో దాడులు ఆపాలి
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఎంటీ అల్ బాహియా, ఎంటి మొంబాసా నౌకలపై జరిగిన దాడులపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నావికులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ జలమార్గాలలో సురక్షితమైన నౌకాయానాన్ని దెబ్బతీసే ఇలాంటి హింసాత్మక దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు పెరగడం, దాడులు పునరావృతం కావడం ఆందోళనకరమని, ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను కాపాడటం కోసం హింసను తక్షణమే నిలిపివేసి, చర్చలు, దౌత్య మార్గాల వైపు మళ్లాలని పిలుపునిచ్చింది. అంతర్జాతీయ చట్టాలకు లోబడి వాణిజ్య నౌకలను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణల కారణంగా హోర్మూజ్‌లో జరిగిన దాడుల వల్ల ఇప్పటి వరకు 11 మంది భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా.. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఘోరంగా ఉల్లంఘించడమేనని, ప్రాంతీయ భద్రతకు ఇది తీవ్ర ముప్పని యూఏఈ రక్షణ శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉద్రిక్తతలపై స్పందించే పూర్తి హక్కు యూఏఈకి ఉందని, తమ భూభాగాన్ని, పౌరులను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని యూఏఈ హెచ్చరించింది.
ఇరాన్‌పై వరుసగా అమెరికా దాడులు
వ్యూహాత్మక జలమార్గమైన హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ, వాణిజ్య నౌకాయాన భద్రతకు సంబంధించి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై అమెరికా వరుసగా మూడో రోజు కూడా దాడులు నిర్వహించింది. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు సెంట్‌కామ్ సోమవారం సాయంత్రం 4:45 గంటల నుండి ఈ తాజా దాడులను ప్రారంభించింది. ఇరాన్‌కు చెందిన కోస్టల్ సర్వేలెన్స్ సిస్టమ్స్, డ్రోన్ కేంద్రాలు, క్షిపణి మౌలిక సదుపాయాలపై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ దళాలు అమాయక పౌరులపై, వాణిజ్య నౌకలపై దాడులు చేయకుండా వారి సామర్థ్యాలను దెబ్బతీసేందుకు ఈ దాడులు చేస్తున్నట్టు సెంట్‌కామ్ పేర్కొంది. కాగా.. అమెరికా దాడుల ప్రకటన వెలువడిన వెంటనే దక్షిణ ఇరాన్ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. రేవు పట్టణమైన బందర్ అబ్బాస్‌లో మూడు భారీ పేలుళ్లు, బందర్ అబ్బాస్ పశ్చిమ భాగంలో ఒక క్షిపణి దాడి జరిగింది. వీటితో పాటు కిష్, కేష్మ్, అబు మూసా దీవులతో పాటు బుషెహర్ ప్రావిన్స్ లోని జామ్, కాంగన్ ప్రాంతాలలో కూడా పేలుళ్లు జరిగినట్లు సమాచారం.
మళ్లీ నౌకదళ దిగ్బంధనం..
ఈ తాజా దాడులకు కొద్దిసేపటి ముందే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై నౌకాదళ దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే సరుకు రవాణాపై 20 శాతం రుసుము విధించనున్నట్లు స్పష్టం చేశారు. ఇరాన్ ఉన్నా, లేకపోయినా హోర్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందని, ప్రాంతీయ భద్రత కల్పిస్తున్నందుకు ప్రతిఫలంగా ఈ రుసుము వసూలు చేయడం న్యాయబద్ధమేనని పేర్కొన్నారు. ఇరాన్‌పై మరింత కఠినమైన సైనిక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ దూకుడును పూర్తిగా అణచివేస్తున్నామని, జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నామని తెలిపారు.
హోర్మూజ్‌లో 20 శాతం రుసుముపై ట్రంప్ వెనక్కి
హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళే అన్ని రకాల సరుకు రవాణా నౌకలపై 20 శాతం రీఇంబర్స్‌మెంట్ రుసుమును విధిస్తామని ప్రకటించిన కేవలం ఒక్క రోజులోనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ రుసుముకు బదులుగా గల్ఫ్ దేశాలు అమెరికాలో భారీగా వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరించాయని, అందుకే ఆ పన్ను ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌కు చెందిన నౌకలు మినహా, మిగిలిన అంతర్జాతీయ రవాణా నౌకలన్నీహోర్ముజ్ జలసంధి నుంచి రాకపోకలు సాగించవచ్చని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ సముద్ర రవాణా మార్గానికి రక్షణ కల్పించినందుకు అమెరికా సైన్యాన్ని ఆయన అభినందించారు. గల్ఫ్ దేశాల భారీ పెట్టుబడి వల్ల అమెరికాలో చారిత్రాత్మక స్థాయిలో ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు. పరిశ్రమల స్థాపన జరుగుతుందని, తద్వారా లక్షలాది మంది అమెరికన్లకు అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.





