E20 Petrol: ఈ20కి ప్రజలు 'నో'.. బీజేపీ ఓటర్లలోనూ వ్యతిరేకత

by S Gopi |

ఇథనాల్ మిశ్రమానికి నేరుగా మద్దతు ఇస్తారా అని అడిగితే 52 శాతం మంది 'కాదు' అని సమాధానం ఇవ్వగా, కేవలం 22 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు.

E20 Petrol: ఈ20కి ప్రజలు నో.. బీజేపీ ఓటర్లలోనూ వ్యతిరేకత
X

దిశ, నేషనల్ బ్యూరో: విదేశీ దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇథనాల్-పెట్రోల్ మిశ్రమం (ఈ20)పై వాహనదారులలో తీవ్ర అపనమ్మకం వ్యక్తమవుతోంది. ఇటీవల జూలై 8, 9 తేదీల్లో 'సీ-వోటర్' నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 55 శాతానికి పైగా ప్రజలు తమ వాహనాలకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో ఈ20 ఇంధనాన్ని వాడేందుకు ఆసక్తి చూపడం లేదు. చివరికి అధికార బీజేపీకి ఓటు వేసిన వారిలో కూడా దాదాపు 53 శాతం మంది ఈ మిశ్రమ ఇంధనాన్ని నిరాకరిస్తున్నారు.

మొత్తం 1,641 మంది పాల్గొన్న ఈ సర్వేలో, ఇథనాల్ మిశ్రమానికి నేరుగా మద్దతు ఇస్తారా అని అడిగితే 52 శాతం మంది 'కాదు' అని సమాధానం ఇవ్వగా, కేవలం 22 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. మరో 25.9 శాతం మంది స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని (52.8 శాతం మంది), ఇంజిన్ భాగాలు దెబ్బతింటాయని (54.2 శాతం మంది) గట్టిగా నమ్ముతున్నారు. సరైన ముందస్తు పరిశోధనలు, క్షేత్రస్థాయి పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తొందరపాటుతో అమలు చేస్తోందని దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.

పాత బండ్లకు శాపం

సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ పెట్రోల్ చౌకగా లభిస్తుందని ప్రచారం సాగినప్పటికీ, అది సాధారణ ధరకే విక్రయించడంపై వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా, ఈ20 ధర సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉంటేనే ఉపయోగించాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయినప్పటికీ, తక్కువ ధర ఉన్నా కూడా కేవలం 40.8 శాతం మంది మాత్రమే ఈ20 కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇథనాల్ మిశ్రమంతో నడిచేలా డిజైన్ చేయని 2023 కంటే ముందున్న పాత వాహనాలకు ఈ20ని తప్పనిసరి చేయడం అన్యాయమని 56.3 శాతం మంది అభిప్రాయపడ్డారు.

పెట్రోల్ బంకులలో ఇథనాల్ పెట్రోల్‌తో పాటు సాధారణ ఇంధనాన్ని కూడా పక్కపక్కనే అందుబాటులో ఉంచాలని (76 శాతం మంది) డిమాండ్ చేస్తున్నారు. అయితే, పెట్రోల్ పంపులలో ఉండే నిల్వ ట్యాంకుల పరిమితుల వల్ల వేర్వేరు గ్రేడ్‌ల పెట్రోల్‌లను విడిగా నిల్వ చేయడం ఆచరణ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, అంతర్జాతీయంగా బ్రెజిల్ దేశంలో ఉన్నట్లుగా.. వినియోగదారునికి నచ్చిన ఇంధనాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించాలనే వాదనలు దేశవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్నాయి.

Next Story