- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహాఘట్‌బంధన్‌లో సీట్ల హెడేక్.. గత పెర్ఫార్మెన్స్ ఆధారంగా సీట్లు ఇస్తారా?
మహాఘట్‌బంధన్‌లో సీట్ల హెడేక్ మొదలైది. గత పెర్ఫార్మెన్స్ ఆధారంగా సీట్లు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్ల పంపకం మరింత జటిలంగా మారుతోంది. విపక్ష మహాఘట్‌బంధన్ కూటమిలో మరో రెండు కొత్త పార్టీలు చేరడంతో ఈ లెక్కలు మరింత క్లిష్టంగా మారాయి. హేమంత్ సోరెన్‌కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరస్‌కు చెందిన ఎల్జేపీ ఈ విపక్ష కూటమిలో చేరాయి. దీంతో ఈ కూటమిలోని పార్టీల సంఖ్య 8కి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్ పార్టీలు గత ఎన్నికల్లో తమకు కేటాయించిన వాటికంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో.. కొత్త పార్టీలు కూటమిలో చేరడం ఈ లెక్కలను మరింత జటిలం చేసింది.
పాశ్వాన్ ఓట్లు చీల్చే ప్లాన్..
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా.. వీటిని ఈ 8 పార్టీలు ఎలా పంచుకుంటాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. పశుపతి పరస్‌ను ఉపయోగించుకొని పాశ్వాన్ కుటుంబానికి పడే ఓట్లను చీల్చేందుకు విపక్ష కూటమి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పాశ్వాన్ కుటంబం స్వస్థలమైన ఖగారియా వంటి సీట్లలో పరస్ కార్డుతో ఫలితాలను మార్చేందుకు మహాఘట్‌బంధన్ ప్రయత్నించడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి తమకు కనీసం 2-3 సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారట. ఈ సీట్లలో తను, తన కుమారుడు పోటీ చేయాలనేది ఆయన ప్లాన్.
కనీసం ఒక్కటైనా..
ఇక జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జేఎంఎం.. ఆర్జేడీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు కేబినెట్ బెర్తులు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేసింది. కాబట్టి ఆ పార్టీకి బిహార్‌లో కూడా సీట్లు కేటాయించడం కూటమి బాధ్యతగా మారింది. అలా చేయకపోతే జార్ఖండ్‌లో పవర్‌ఫుల్‌గా ఉన్న జేఎంఎం.. ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పేసే ప్రమాదముంది. ఈ క్రమంలోనే జార్ఖండ్ బోర్డర్‌కు సమీపంలోని బంకా, ముంగర్, భగల్‌పూర్ వంటి సీట్లు తమకు కేటాయించాలని జేఎంఎం డిమాండ్ చేస్తోంది.
50 సీట్లు.. డిప్యూటీ సీఎం పోస్టు..
ఇక ముకేష్ సాహ్నీ నేతృత్వంలోని వీఐపీ (వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ) ఏకంగా 50 సీట్లు కావాలని అడుగుతోంది. కూటమి గెలిస్తే తనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వాలని సాహ్ని ఇప్పటికే డిమాండ్ చేశారు. ఏదో ఒకటి చేసి 20-25 సీట్లకు సాహ్నిని ఒప్పించాలని కూటమి పెద్దలు భావిస్తున్నారట. దీంతో కాంగ్రెస్ సీట్లలో కోత పడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక గత ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేసిన సీపీఐ-ఎంఎల్ కూడా తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది.
అందరూ సీట్లు తగ్గించుకోవాలి..
ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కొన్ని సీట్లు వదులుకోక తప్పదని, అప్పుడే అందరూ సంతృప్తి పడేలా సీట్ల కేటాయింపు జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ కూటమిలో సింహభాగం సీట్లు తీసుకునే ఆర్జేడీ దిగొచ్చి తన సీట్లు తగ్గించుకునేందుకు అంగీకరిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. రాహుల్ గాంధీ ముందే పరోక్షంగా తానే సీఎం అభ్యర్థి అని ప్రకటించిన తేజస్వి యాదవ్ వెనక్కు తగ్గడం కష్టమనే నిపుణులు అంటున్నారు. దానికితోడు ప్రస్తుతం బిహార్‌లో గాలి తమ వైపే వీస్తోందని ఆర్జేడీ కూడా బలంగా నమ్ముతోంది. ఇలాంటి సమయంలో తమ సీట్లు తగ్గించుకోవడమంటే ఎన్డీయేకు మేలు చేసినట్లేనని ఆ పార్టీ అనుకుంటోందట.
గత పెర్ఫామెన్స్ ఎలా ఉంది?
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీల ప్రదర్శన వివరాలు చూస్తే.. 2020 ఎన్నికల్లో ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 స్థానాలు నెగ్గింది. కాంగ్రెస్ 70 సీట్లలో నిలబడి 19 స్థానాల్లో గెలిచింది. సీపీఐ-ఎంఎల్ పోటీ చేసిన 19లో 12 సీట్లలో విజయఢంకా మోగించింది. సీపీఎం 4 సీట్లలో పోటీ చేసి రెండింట జయకేతనం ఎగరేసింది. సీపీఐ పోటీ చేసిన 6 సీట్లలో రెండు నెగ్గింది. ఈ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఈసారి సీట్ల కేటాయింపు చేయాలనుకుంటే.. కచ్చితంగా సగం సీట్లు మాత్రమే గెలిచిన ఆర్జేడీ సీట్లలో కోత పెట్టాలని కూటమి నేతలు అడిగే అవకాశం ఉంది. తామే కూటమికి ‘పెద్దన్న’ అని భావిస్తున్న ఆర్జేడీ దీనికి ఒప్పుకుంటుందా? అనేది ప్రశ్న.






