- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: ఎన్నో ఆశలతో మీరు ఇక్కడి వరకూ వచ్చారు.. తప్పకుండా అండగా ఉంటాం
అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడే భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం వచ్చిన విద్యార్థులు, అవగాహన లేక ఏమైనా తప్పు చేస్తే వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు బీఆర్ఎస్ అమెరికా విభాగం తరఫున ప్రయత్నం చేస్తామన్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ విద్యార్థులతో కేటీఆర్ మాట్లాడారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అమెరికా వచ్చిన విద్యార్థులు ఏదైనా కారణంతో తిరిగి వస్తే ఆ విద్యార్థితోపాటు వారి కుటుంబం ఎంతో ఆవేదనకు గురవుతుందన్నారు. అందుకే వారికి అండగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు సైతం అమెరికా చట్టాలను అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకొని మసులుకోవాలని సూచించారు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రపంచంలో మంచి మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేయాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆవిష్కరణలు వస్తున్నాయని.. ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీపడి రాణించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికాలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. రిస్కు తీసుకున్నప్పుడే కలలు సాకారం అవుతాయనడానికి కేసీఆర్ జీవితమే సాక్ష్యమన్నారు. 14 సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పుడు సమాజంలోని ప్రతి ఒక్కరు కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారన్నారు. అలాగే.. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారు. అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగి వచ్చి కంపెనీలు ప్రారంభించాలని విద్యార్థులను కోరారు. మనదేశంలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ అనేక అవకాశాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. దేశం, తెలంగాణ అభివృద్ధిలో విదేశాల్లో చదువుకుంటున్న యువత భాగం కావాలని పిలుపునిచ్చారు.






