2028 ఎన్నికల్లో పోటీ చేయను : కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

by I. Sairam |

2028లో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

2028 ఎన్నికల్లో పోటీ చేయను : కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయాలు భ్రష్టు పట్టుపోయాయని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ.. నేటి రాజకీయాల్లో అవినీతి బాగా పెరిగిపోయిందని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని, నిజాయితీతో కూడిన రాజకీయాలకు నిలబడటానికి స్థానం లేనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయానికి వచ్చానని వివరించారు. తన వరుణ నియోజకవర్గానికి చెందిన ప్రజలు తనను మరోసారి పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, అయితే భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని తాను నిశ్చయించుకున్నానని చెప్పారు. తనకు ఇప్పుడు 79 ఏళ్లని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 81-82 ఏళ్లు వస్తాయని, తన ఆరోగ్యం గతంలో ఉన్నంత బలంగా లేదని, పూర్వపు ఉత్సాహంతో పనిచేయడం ఇకపై సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు తనను తమలో ఒకడిగా ఆప్యాయంగా చూసుకున్నారని, ఈ రుణం తనకు భారంగా ఉందని అన్నారు. తాను గెలుపోటములు రెండింటినీ చూశానని, కానీ నమ్మిన సూత్రాలకు వ్యతిరేకంగా నడుచుకోలేదని, తన మనస్సాక్షిని వంచించలేదని సంతృప్తిగా ఉందని అన్నారు. రాజకీయాల నుండి తప్పకున్నప్పటికీ, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని, వారి కష్టసుఖాలకు గొంతుకగా కొనసాగుతానని తెలిపారు.

Next Story