మొదటి రోజే రిజైన్‌‌కు ధర్మేంద్ర ప్రధాన్ సిద్ధం : మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయవర్గీయ

by I. Sairam |

విద్యార్థుల ఉద్యమ ప్రారంభమైన తొలి రోజే ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత కైలాస్ విజయవర్గీయ అన్నారు.

మొదటి రోజే రిజైన్‌‌కు ధర్మేంద్ర ప్రధాన్ సిద్ధం : మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయవర్గీయ
X

దిశ, నేషనల్ బ్యూరో : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వివాదంపై దేశవ్యాప్తంగా చెలరేగిన భారీ నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ కీలక విషయాలను వెల్లడించారు. ఇండోర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ధర్మేంద్ర ప్రధాన్ తనకు విద్యార్థి రాజకీయాల రోజుల నుంచే తనకు తెలుసు అని అన్నారు. నీట్ లీకేజీ వివాదంపై విద్యార్థుల ఆందోళనలు ప్రారంభమైన మొదటి రోజే ప్రధాన్ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడికి తెలియజేశారని చెప్పారు. కానీ ఆ సమయంలో పార్టీ అధిష్ఠానం రాజీనామా చేయవద్దని వారించిందని స్పష్టం చేశారు. కానీ పరిస్థితుల ప్రభావంతో రాజీనామా చేయాలని పార్టీ నిర్ణయించిందని, మరుక్షణమే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా పదవిని విడిచిపెట్టారని చెప్పారు. ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తకు ఇలాంటి లక్షణాలే ఉంటాయని కొనియాడారు.

బంగ్లాదేశ్, శ్రీలంకలా హింసకు ప్లాన్..

బంగ్లాదేశ్, శ్రీలంకలలో జరిగినట్లుగా భారత్‌లో కూడా హింసను ప్రేరేపించి దేశాన్ని అస్థిరపరచాలని విదేశీ శక్తులు కుట్రలు పన్నాయని, అయితే వీటిని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా భగ్నం చేసిందని విజయవర్గీయ వ్యాఖ్యానించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయం అని అన్నారు. విద్యార్థులు మాత్రమే ఈ ఉద్యమాన్ని నడిపారని, ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం వారి వెనుక నిలబడి ప్రయోజనం పొందాలని చూసిందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన ప్రతిపక్షానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఒక కొత్త ఆశ కనిపించిందని ఎద్దేవా చేశారు.

Next Story