మైనర్లు పారిపోవడాన్ని ప్రభుత్వం ఆపగలదా ? : పోక్సో చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

by I. Sairam |

మైనర్లను లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు తీసుకొచ్చిన పోక్సో చట్టం దుర్వినియోగం అవుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

మైనర్లు పారిపోవడాన్ని ప్రభుత్వం ఆపగలదా ? : పోక్సో చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మైనర్ అమ్మాయిలు, అబ్బాయిలు తమ ఇష్టపూర్వకంగా ఇంటిని వదిలిపెట్టి పారిపోవడాన్ని ప్రభుత్వం ఆపగలదా ? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తీవ్రమైన లైంగిక వేధింపుల నుండి పిల్లలను రక్షించడానికి తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని, టీనేజర్ల మధ్య పరస్పర అంగీకారంతో కూడిన ప్రేమ వ్యవహారాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి తప్పుడు కేసులు పెట్టి దుర్వినియోగం చేస్తుండటంపై న్యాయస్థానం సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. టీనేజ్ అమ్మాయిలు ఇష్టపూర్వకంగా తమ భాగస్వాములతో పారిపోయినప్పుడు, తల్లిదండ్రులు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి తరచుగా క్రిమినల్ కేసులను పెడుతున్నారని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వాస్తవానికి పిల్లలపై జరిగే లైంగిక దాడిని, దోపిని అరికట్టడానికి పోక్సో చట్టం తెచ్చారని, కానీ తల్లిదండ్రులు దీనిని టీనేజ్ ప్రేమ జంటలను శిక్షించడానికి ఒక ఆయుధంగా వాడుతున్నారని తెలిపింది. 15-18 సంవత్సరాల వయస్సు అనే భావోద్వేగ పరంగా సున్నితమైనదని, అది కొత్త విషయాలను తెలుసుకునే వయస్సు అని పేర్కొంది. మైనర్ల మధ్య ఇష్టపూర్వకంగా, అంగీకారంతో జరిగే సంబంధాలు పోక్సో కిందికి వస్తాయా అని ప్రశ్నించింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై 25 ఏళ్ల యువకుడిపై నమోదైన పోక్సో కేసును కొట్టివేస్తూ కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

Next Story